సొంతింటి కల నెరవేరుతుందని ఆశపడ్డారు. డబుల్ బెడ్ రూం అంటే నమ్మారు.. ఏళ్లు గడుస్తున్నాయి గానీ.. కల నెరవేరడం లేదు. ప్రభుత్వం కనికరం చూపడం లేదు. దీంతో నిరసన బాట పట్టారు సికింద్రాబాద్ మారేడ్ పల్లి వాసులు. తమ ఇంటి స్థలాలను ప్రభుత్వానికి అప్పచెప్పి.. కిరాయి ఇళ్లల్లో, రోడ్లపై గుడిసెలు వేసుకొని బతుకుతున్నామని.. నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు ఇల్లు కేటాయించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను సంవత్సరం లోపే కట్టించి ఇస్తామంటే నమ్మకంతో ఖాళీ చేశామని చెప్పారు. రెక్కాడితేగానీ డొక్కాడని తమకు కరోనా కారణంగా పనులు లేక, తిండి దొరక్క, కిరాయిలు కట్టుకోలేక అనేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. దీనికి తోడు నిజమైన అర్హులమైన తమకు ఇళ్లు కేటాయించకుండా స్థానికేతరులకు ఇస్తున్నారని మండిపడ్డారు.
లబ్ధిదారుల పేర్లు బహిర్గతం చేయడంతో పాటు వెంటనే ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మారేడ్ పల్లి వాసులు. లేకపోతే ప్రారంభోత్సవంతో సంబంధం లేకుండా తామే ఇళ్లలోకి ప్రవేశిస్తామని హెచ్చరించారు. అంతేకాదు.. అర్హులందరికీ సరిపోయే విధంగా ఇళ్ల నిర్మాణం జరిగిందని.. ఖాళీగా ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాల్ గానీ.. ప్రభుత్వ ఆసుపత్రి గానీ నిర్మించాలని కోరారు. దానికి విరుద్ధంగా అక్కడ వేరేవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తే మాత్రం అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.