ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వారికి ప్రయాణ కష్టాలు తప్పేట్టుగా లేవు. హైదరాబాద్ నుండి ఏపీ వైపు వెళ్లే రైళ్లల్లో సీట్లన్నీ ఫుల్ గా నిండిపోయాయి. ప్రతి రైలులో ఇప్పటికే వందల్లో వెయిటింగ్ లిస్ట్ ఉంది. దీంతో సొంతూరిలో పండుగ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు.
పండగకు వారం ముందు నుంచి టిక్కెట్లు దొరికే పరిస్థితులు లేవు. ఏపీకి వెళ్లే గోదావరి,గౌతమి,విశాఖ,ఫలకనుమా,సింహపురి,నర్సాపూర్,మచిలీపట్నం, చెన్నై, చార్మినార్, గరీబ్ రథ్ వంటి రెగ్యులర్ రైళ్లలో బెర్తులు దొరకడం కష్టంగా మారింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, బెంగాల్ వైపు వెళ్లే రైళ్లలో కూడా బెర్త్ లు ఖాళీగా లేవు. ప్రతిసారి సంక్రాంతికి రైల్వే శాఖ ఏపీ,కర్ణాటక,తమిళనాడు ఇతర ప్రాంతాలకు స్పెషల్ రైళ్లను నడుపుతుంది.
గతేడాది కరోనా కారణంగా సాధారణ రైళ్లు తప్పితే స్పెషల్ ట్రైన్స్ నడపలేదు. ఇక జనవరి రెండో వారం వరకు రెగ్యులర్ రైళ్లు మరియు స్పెషల్ రైళ్లు ఫుల్ అయిపోయాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ వో రాకేశ్ వెల్లడించారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాల మధ్య 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రకారం ప్రత్యేక రైళ్లలో రిజర్వ్ డ్ ఇంకా అన్ రిజర్వ్ డ్ కోచ్ లు ఉంటాయని వెల్లడించారు.
ప్రయాణికులు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు కాకుండా వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో టిక్కెట్ లను బుక్ చేసుకోవచ్చు. అయితే ఒమిక్రాంట్ వేరియంట్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను బట్టి రానున్న రోజుల్లో నిబంధనలు కఠినతరం చేస్తామని చెప్పారు.