హైదరాబాద్ రాంగోపాల్ పేట్ లో అగ్నిప్రమాదంలో మంటలు ఎంతకీ అదుపులోకి రావడం లేదు. భవనంలో నుంచి భారీగా ఎగసిపడుతున్నాయి. ఇప్పటివరకూ భవనంలో చిక్కుకున్న ఐదుగురిని కాపాడారు. 12 ఫైరింజన్లతో మంటలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. పొగ వల్ల ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలి దగ్గర 5 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు అధికారులు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. భవనం లోపల నుంచి పేలుడు శబ్ధాలు కూడా వినిపించాయి. మంటల ధాటికి భవనం కూలిపోతుందని స్థానికులు భయపడిపోతున్నారు. ఇటు మంటలు మరో 4 భవనాలకు వ్యాపించాయి.
ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. భవనంలో మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మంటలు, తీవ్రమైన పొగ వల్ల సహాయచర్యలకు విఘాతం కలుగుతోంది.
అధికారులు భవనం పక్కనున్న కాచీబౌలి కాలనీని ఖాళీ చేయిస్తున్నారు. అలాగే.. చుట్టుపక్కల ఇళ్ల నుంచి గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్నారు. పొగతో చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మినిస్టర్ రోడ్ లో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. షాపు వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. పోలీసులు వాహనాలను నిలిపివేయడంతో కాసేపు భారీగా ట్రాఫిక్ స్తంభించింది.