తిరుమల శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న.. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చేస్తోంది. ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్ నుంచి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.తొలి రోజు ఉదయం 11:30 సికింద్రాబాద్ నుంచి వందే భారత్ రైలు తిరుపతికి బయలుదేరుతుంది.
ఎనిమిదిన్నర గంటల ప్రయాణం అనంతరం.. రాత్రి 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. దారి పొడవునా ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభోత్సవం రోజు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో రైలు ఆగుతుంది. కానీ సాధారణ ప్రయాణికులను అనుమతించరు. అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలకాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఏప్రిల్ 9న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఈ రైలు బయలుదేరుతుంది.
ఇక ఏప్రిల్ 10 నుంచి ప్రతి రోజూ సికింద్రాబాద్ నుంచి తిరుపతి, అదే రోజు తిరుపతి నుంచి తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగతా అన్ని రోజులు నడుస్తుంది. సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు రైలు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 02:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 03:15 కి తిరుపతిలో బయలుదేరి.. రాత్రి 11:45 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది.
టికెట్ ధరలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.మొత్తం 662 కి.మీ. దూరాన్ని ఎనిమిదిన్నర గంటల్లో పూర్తి చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్-వందేభారత్ రైలు సగటు వేగం గంటకు 77 కి.మీ. ఐతే గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సగటు వేగం ఇంత తక్కువగా ఉండడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. 12 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటున్నాయి. సెమీ హైస్పీడ్ రైలు అయిన వందేభారత్‌కు ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది. ఈ మాత్రం దానికే అంత ధర పెట్టి టికెట్ కొనలా? అని కొందరు పెదవి విరుస్తున్నారు.