వందే భారత్ ఎక్స్ ప్రెస్.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమవుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టబోతోంది. ఈ రైలును ప్రధాని మోదీ జనవరి 15న వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
వాస్తవానికి ఈ ట్రైన్ ను మొదటగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే అనుకున్నారు. అయితే ట్రాక్ అప్ గ్రడేషన్ పనులు విజయవాడ-విశాఖపట్నం మధ్య పూర్తవడంతో పాటు పలువురు నేతలు వందే భారత్ ను విశాఖపట్నం వరకు పొడిగించాలని విజ్ఞప్తులు చేయగా కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ వరకు పొడిగించింది.
ప్రస్తుతం చెన్నై నుంచి విశాఖకు ఈ రైలు చేరుకుంది. ఈ రైల్లో 16 కోచ్ లు ఉన్నాయి. 1,128 సీట్లు ఉన్నాయి. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో సికింద్రాబాద్-విశాఖ మధ్య ఉన్న 699 కిలోమీటర్లను 8గంటల 40 నిమిషాల్లోనే డెస్టినేషన్ కు చేరుకుంటుందని రైల్వేశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. (నిజానికి సికింద్రాబాద్ నుంచి వైజాగ్ చేరుకోవాలంటే 12 నుంచి 14 గంటల సమయం పడుతుంది.)
ఈ ట్రైన్ ఉదయం 5గంటల 45 నిమిషాలకు బయలుదేరి సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు చేరుతుంది. అలాగే సికింద్రాబాద్ లో 2గంటల 45 నిమిషాలకు బయలుదేరి విశాఖకు రాత్రి 11గంటల 25 నిమిషాలకు చేరుకుంటుంది.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ రైల్లో ఏసీ చైర్ కార్ ధర 1800 రూపాయలు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.3వేల 300 వరకు ఉండొచ్చని అంచనా. అయితే, ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్, టికెట్ ధరలు, ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందనే విషయంపై ఇంకా రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.