సికింద్రాబాద్ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం వలన ఎంత ఆస్తి నష్టం జరిగిందో అని ఇప్పుడే అంచనా వేయలేమని క్లబ్ ప్రెసిడెంట్ రఘురామ అన్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలన జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్లబ్ ముందు భాగం మొత్తం కలప, చెక్కతో కూడి ఉంది కాబట్టి ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని.. ఆర్కిటెక్చర్ , సివిల్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ ఘటనా స్థలానికి చేరుకున్న తరువాత నష్టాన్ని అంచనా వేస్తారని చెప్పారు.
ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతూ.. క్లబ్ అంతటా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దీంతో స్థానికులు భయాదోళనలకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సంఘటనా స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. మొత్తం 10 ఫైర్ ఇంజన్లలో సాయంతో మంటలు ఆర్పారు. పది ట్యాంకర్లతో గంట సమయం శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా.. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
24 ఎకరాల్లో క్లబ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ క్లబ్ లో నాలుగు వేల మందికి సభ్యత్వం ఉంది. హెరిటేజ్ బిల్డింగ్ తో పాటు బార్ మొత్తం ప్రమాదంలో కాలిపోయింది.