ముంబై ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు అందడంతో సెక్యూరిటీని పెంచారు. ముంబై నుంచి అహ్మదాబాద్ కి ఈ విమానం బయలుదేరాల్సి ఉంది. అయితే ఫ్లైట్ లో బాంబు ఉందని, పేల్చివేస్తామని నిన్న రాత్రి అధికారులకు ఈ-మెయిల్ అందింది. దీంతో 6 e 6045 విమానాన్ని నిలిపివేశామని .. బాంబు స్క్వాడ్ తో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారని వారు తెలిపారు. చివరకు బాంబు లేదని తెలియడంతో.అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎవరో ఆకతాయి ఈ మెయిల్ పంపినట్టు భావిస్తున్నామని అధికారులు చెప్పారు. దీని కారణంగా విమానం బయలుదేరడంలో జాప్యం జరిగింది. ఇండిగో యాజమాన్యం నుంచి అందిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ-మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందన్నదానిపై ఆరా తీస్తున్నారు.
గత నెల 30 న కూడా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేసియా వెళ్ళబోతున్న విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ అందింది. దీంతో ఈ విమానంలో కూడా తనిఖీలు జరిపి బెదిరింపు వట్టిదే అని తేల్చారు
సుమారు రెండున్నర గంటల తరువాత ఈ విమానం మలేసియాకు బయల్దేరింది. . అయితే అనుమానం మీద నలుగురు ప్రయాణికులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆగస్టు 27 న కూడా.. ఇండియా నుంచి తన కుటుంబం వెళ్లకుండా చూసేందుకు ఓ వ్యక్తి దుబాయ్ బయలుదేరబోతున్న ఓ ప్రైవేటు విమానాన్ని పేల్చివేస్తానని బెదిరించాడు. తాగిన మత్తులో ఉన్న అతడిని పోలీసులు అరెస్టు చేశారు.