ప్రధాని మోడీ కర్ణాటక పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం హుబ్బళి చేరుకున్న మోడీ .. రోడ్ షో నిర్వహిస్తుండగా పోలీసుల బ్యారికేడ్లను దాటుకుని ఓ యువకుడు చేతిలో పూలదండతో ఆయన కాన్వాయ్ వద్దకు పరుగెత్తుకు వచ్చాడు. సెక్యూరిటీని తోసుకుని ఆయనకు పూలమాల వేసేందుకు యత్నించాడు.
అయితే పోలీసులు, ప్రధాని భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే అతడ్ని వెనక్కి లాగేశారు. ఈ ఉదంతమంతా వీడియోకెక్కింది. కానీ ఈ ఘటనలో భద్రతా వైఫల్యం లేదని, పూలమాలను అందుకునేందుకు మోడీ తన చేతులను చాచి వాహనం నుంచి కొంత ముందుకు వంగారని పోలీసు వర్గాలు తెలిపాయి.
అసలు ఈ ప్రాంతాన్నంతటినీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు ముందే తన ఆధీనంలోకి తీసుకుందని, తనకు పూలమాల వేసేందుకు మోడీ ఆ యువకుడిని అనుమతించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి.
ఆ యువకుడి నుంచి పూలమాలను తీసుకున్న ఆయన దాన్ని తన వాహనం ముందు భాగంలో ఉంచారని కూడా వార్తలు వచ్చాయి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు మోడీ హుబ్బళి చేరుకున్నారు. ఏమైనా ఇది భద్రతా వైఫల్యమేనని అంటున్నవారు కూడా ఉన్నారు.