ఉత్తర ఢిల్లీలో పట్టపగలు దారుణం జరిగింది. మంగళవారం సాయంత్రం నగరం లోని వజీరాబాద్ ప్రాంతంలో నగదుతో వెళ్తున్న వ్యాన్ ని అడ్డగించిన దుండగుడు సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో జైసింగ్ అనే గార్డు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించే లోగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు.
నగదును ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద గల ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగుడు హఠాత్తుగా వెనుక నుంచి వచ్చి గార్డుపై కాల్పులు జరిపాడని, సుమారు 8 లక్షలతో ఉడాయించినట్టు తెలుస్తోందని డీసీపీ సాగర్ సింగ్ కల్సి తెలిపారు.
ఈ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, నిందితుడి పట్టివేతకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి వజీరాబాద్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. తీవ్రంగా గాయపడిన జైసింగ్ ని మరో ఉద్యోగి ఆసుపత్రికి తీసుకువెళ్లాడని సాగర్ సింగ్ చెప్పారు. దోపిడీకి గురైన మొత్తం ఇంకా ఎక్కువే ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు.