దేశద్రోహానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ 124 ఎ పై పునఃపరిశీలన పూర్తయ్యే వరకు ఈ నిబంధన కింద నమోదైన కేసులను నిలుపుదలలో ఉంచాలని రాష్ట్రాలను ఆదేశిస్తారా లేదా తెలపాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలపై కేంద్రం స్పందించింది.
దేశ ద్రోహ చట్టంపై పరిశీలనలు జరుగుతున్న సమయంలో ఇది వరకే ఈ చట్టం కింద నమోదైన కేసులను తాత్కాలికంగా నిలుపుదల చేయకూడదని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది.
రాజ్యాంగం సమర్థించిన దేశ ద్రోహ నిబంధనలపై స్టే విధించడం సరైన విధానం కాదని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలియజేసింది.
ఈ కేసులో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ… దేశ ద్రోహ నేరానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ల నమోదును నిరోధించలేమని తెలిపారు. ఈ నిబంధన కాగ్నిజబుల్ నేరానికి సంబంధించినదని, దీన్ని 1962లో రాజ్యాంగ ధర్మాసనం సమర్థించినందున అది వీలుకాదని పేర్కొన్నారు.
పెండింగ్‌లో ఉన్న దేశద్రోహ కేసులకు సంబంధించి, ప్రతి కేసులో నేర తీవ్రత ప్రభుత్వానికి తెలియదన్నారు. ఆ కేసుల్లో ఉగ్రవాదం లేదా మనీలాండరింగ్ కోణాలు కూడా ఉండవచ్చు కాబట్టి అలాంటి విషయాల్లో బెయిల్ పిటిషన్‌లపై విచారణను వేగవంతం చేయవచ్చని కేంద్రం సూచించింది.
దేశద్రోహ నేరానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ల నమోదును పర్యవేక్షించేందుకు పోలీసు సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారి నియామించాలని సూచించింది. దేశ ద్రోహం కేసు నమోదు చేయాలంటే ఆ అధికారి అనుమతి తీసుకోవాలని చెప్పింది.