కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సహా ఆరుగురు జర్నలిస్టులపై దేశద్రోహాం కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఈ కేసులు నమోదు చేశాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆందోళనలో హింస చెలరేగటంపై తప్పుడు సమాచారం పోస్ట్ చేసి… దేశ సమగ్రతను దెబ్బెతీసేలా వ్యవహరించారంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది.
నోయిడాలో ఒకటి, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, హోషంగాబాద్, ముల్తాయ్, బేతుల్‌లో నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో పాటు మృణాల్ పాండే, వినోద్ జోష్, జాఫర్ ఆఘా, పరేశ్ నాథ్, అనంత్ నాథ్‌ల పేర్లను ఎఫ్ఐఆర్‌లలో చేర్చారు. ఢిల్లీ పోలీసులు రైతును కాల్చి చంపడం వల్లే రైతులు ఎర్రకోటను ముట్టడించారని పేర్కొంటూ శశిథరూర్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యక్తిగత సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎలా కేసులు పెడతారంటూ మండిపడింది. ఆ సమయంలో అక్కడున్న వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోస్టులు పెడతారని, అది జర్నలిస్టుల లక్షణం అన్నారు.
హింసకు బాధ్యులుగా చూపిస్తూ… ఉద్యమాన్ని అణిచివేస్తున్నారని, కేసులతో అందర్నీ భయపెడుతున్నారని ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయి.