దేశ ద్రోహ చట్టం కింద ఎలాంటి కొత్త కేసులనూ నమోదు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. చట్టంపై పునః పరిశీలన పూర్తయ్యే వరకు ఇప్పటికే నమోదైన కేసుల్లో ఎలాంటి విచారణలు గానీ, నిర్బంధ చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా ఏవైనా కేసులు దాఖలైతే దాన్ని తాము బుధవారం తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టులు వాటిని పరిష్కరిస్తాయని తెలిపింది. పెండింగ్ లో ఉన్న కేసులు, అప్పీళ్లను నిలుపుదల చేయనున్నట్టు పేర్కొంది.
దేశద్రోహ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. వాటిని త్వరగా పరిష్కరించాలని కోర్టులకు సూచించింది.
అంతకు ముందు రాజ్యాంగం సమర్థించిన దేశద్రోహ చట్టంలోని నిబంధనలపై స్టే విధించడం “సరైన విధానం కాకపోవచ్చు” అని బెంచ్‌కు కేంద్రం తెలిపింది.