సీడ్ యాక్సెస్ రోడ్డుకు వైసీపీ గ్రామం ఉండవల్లి దారిస్తుందా? సీడ్ యాక్సెస్ రోడ్డు ఆటంకాలు తొలగుతాయా? సీఎం చొరవతో సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూసేకరణ సమస్యలు పరిష్కారమవుతాయా? అంతకుముందు సాధ్యం కాని రోడ్డు నిర్మాణం ఉండవల్లి ఏరియాలో ఇప్పుడు జగన్ సర్కార్‌లో సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి.
గుంటూరు: ప్రభుత్వం మారి నాలుగు నెలలు కావొస్తోంది. ఇప్పటికే సిద్ధంగా ఉన్న కొన్ని నిర్మాణాలు ఎప్పటికి ప్రారంభిస్తారో అర్ధం కావడం లేదు. రోజులు గడిచిపోతున్నాయి కానీ, అమరావతిపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఇప్పటికే పూర్తయిన నిర్మాణాల సంగతి ఇంకా గాల్లోనే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడేవారే లేరు. ముఖ్యంగా రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డు కొంచెం నిర్మాణం తుది దశలో వుంది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వానికి సహకరించని ఉండవల్లి గ్రామ పరిధిలో ఈ తుది దశ నిర్మాణం వుంది. ఈ గ్రామం వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేతిలో వున్న గ్రామం. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తవ్వలంటే స్థానికంగా వున్న రైతులు భూ సేకరణకో, భూ సమీకరణకో అంగీకరిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది.
సీడ్ యాక్సెస్ రోడ్ తొలిదశ దొండపాడు నుంచి ఉండవల్లి కొండవీటివాగు లిఫ్ట్ దగ్గర నీళ్ల ట్యాంక్ వరకు 18.3 కి.మీ. దూరం 252 కోట్ల వ్యయంతో ఎన్.సి.సి. చేపట్టింది. ఇది ప్రస్తుతం దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 14 కి.మీ. అక్కడక్కడ కొంత మినహా పూర్తయింది. రాయపూడిలో 300 మీటర్లు భూసేకరణ సమస్యతో, దొండపాడు దగ్గర లోకల్ రోడ్స్ సమస్యతో 100 మీటర్లు పెండింగులో ఉంది. దొండపాడు నుంచి వెంకటపాలెం మీదుగా కృష్ణాయపాలెం వరకు పూర్తయిన సీడ్ యాక్సిస్ రోడ్డు అక్కడి నుంచి ఉండవల్లి వరకు భూసేకరణ సమస్యతో ఆగింది. దీనికి వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఒప్పిస్తే పరిష్కారం దొరుకుతుంది.
ఇక సెకండ్ ఫేస్ సీడ్ యాక్సిస్ రోడ్డు జాతీయ రహదారిపై లింక్ చేసే మార్గం ఇంకా మొదలుకాలేదు. దీనికి భూసేకరణ సమస్యలు, పలు అభ్యంతరాలున్నాయి.
సీడ్ యాక్సిస్ రోడ్డు ఆటంకాలు తొలగి ముందుకు కదలాలంటే సాక్షాత్తు సీఎం జగన్ చొరవ చూపాల్సిందే. లేకుంటే సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తికావడం కష్టమే. అమరావతికి రాజమార్గం అసంపూర్ణమే. దీనిపై సీఎం స్పందిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్ధకమే?