టీఆర్ఎస్ నేతలే ఎలక్షన్ టూరిస్టులని, ఎన్నికలప్పుడే ప్రజల్లో తిరుగుతారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. రాహుల్ గాంధీ డమ్మీ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డమ్మీలెవరో, డమ్మీ మంత్రులెవరో అందరికీ తెలుసున్నారు. రాహుల్ గాంధీ రాకను చూసి టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని విరుచుకుపడ్డారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మంత్రికైనా స్వేచ్ఛ ఉందా..? అని ప్రశ్నించారు సీతక్క. ప్రజా సమస్యలు తెలుసుకుని రాహుల్ గాంధీ మాట్లాడితే.. స్క్రిప్టు అంటారా అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. రాహుల్ పర్యటనపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్ధం కావడంలేదన్నారు.
ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రిపోర్ట్ తో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారని గుర్తు చేశారు. మీరు ముఖ్యమంత్రి కాకుండానే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు.
ఆంధ్రా నాయకుల పాలనలో కూడా ఇప్పుడున్న పరిస్థితులు లేవని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీతక్క. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనని.. అయినా రాహుల్ ను అడ్డుకోలేకపోయాయని వ్యాఖ్యానించారు. రాహుల్ పై టీఆర్ఎస్ నాయకుల విమర్శలు హాస్యాస్పదం, అర్థరహితంగా ఉన్నాయని ఆరోపించారు సీతక్క.