రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలనేది ప్రభుత్వ విధానమని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రజలు అధికారికంగా కుళాయి కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు. ప్రజలను గందరగోళపరిచే విధంగా మీడియా సంస్థలు వ్యవహరించకూడదని అన్నారు. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేయడమనేది ఎప్పటి నుంచో ఉన్నదేనని బొత్స స్పష్టం చేశారు.
ప్రజలను ఇబ్బంది పెట్టి జప్తు చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని వివరించారు. ప్రజలు సక్రమంగా పన్నులు చెల్లిస్తేనే.. స్థానిక సంస్థలు సక్రమంగా నిర్వహించగలుగుతామని వ్యాఖ్యానించారు. ఆస్తి పన్ను వసూలు కోసం ఇంటి ముందు బ్యానర్ కడితే తప్పేముందని ప్రశ్నించారు.
బలవంతపు పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఎక్కడా ఆదేశించలేదనే విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికారికంగా కుళాయి కనెక్షన్లు తీసుకోవడం అనేది ప్రజలు హక్కుగా భావించాలని బొత్స అన్నారు.
ఆస్తుల జప్తు ఇవాళ కొత్తగా వచ్చిన అంశం కాదని.. పన్నులు కట్టకుంటే ఆస్తులు జప్తులు చేస్తామనడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కావాలని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయడం మంచిది కాదని హెచ్చరించారు బొత్స సత్యనారాయణ.