వాహనదారులు తమ టూవీలర్లు, కార్లపై తమ కులానికి సంబంధించిన పేర్లను స్టిక్కర్లుగా వేసుకుంటుంటారు. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ తరహా విధానం మనకు కనిపిస్తుంది. తమ కులం అంటే వారికి అదొక స్టేటస్ సింబల్ అని భావిస్తూ వారు తమ కులానికి చెందిన స్టిక్కర్లను వాహనాలపై అతికిస్తుంటారు. కార్లు అయితే విండ్ స్క్రీన్లు, వెనుక నంబర్ ప్లేట్లపై, టూవీలర్లు అయితే ముందు భాగంలో డోమ్, వెనుక భాగంలో నంబర్ ప్లేట్లపై తమ కులాలకు చెందిన స్టిక్కర్లను అతికిస్తుంటారు. అయితే ఈ విషయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
మహారాష్ట్రకు చెందిన ఉపాధ్యాయుడు హర్షల్ ప్రభు ప్రధాన మంత్రి ఆఫీస్‌కు ఓ లేఖ రాశాడు. వెబ్‌సైట్ ద్వారా తన లేఖను పీఎంవోకు పంపించాడు. ఈ క్రమంలో ఆ లేఖను విచారించిన పీఎంవో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ రాష్ట్ర అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ముకేష్ చంద్ర అక్కడి అన్ని ప్రాంతీయ రవాణా శాఖ ఆఫీస్‌లకు ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాలపై కులాలకు సంబంధించిన స్టిక్కర్లు ఉంటే వెంటనే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో అక్కడ ఆర్‌టీవో అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మరీ అలాంటి వాహనదారులను గుర్తించి వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.
కాగా యూపీలో ప్రతి 10 వాహనాల్లో ఒక వాహనానికి కులం స్టిక్కర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అలాంటి వాహనాలను ఎట్టి పరిస్థితిలోనూ సీజ్ చేస్తామని తెలిపారు. కాగా అక్కడ సమాజ్‌వాదీ పార్టీ హయాంలో వాహనాలపై ఎక్కువగా యాదవ్ పేరిట స్టిక్కర్లు కనిపించాయి. తరువాత బీఎస్‌పీ హయాంలో జాటవ్ స్టిక్కర్లను వేసుకున్నారు. ఇక ప్రస్తుతం యోగి ప్రభుత్వంలో చాలా మంది క్షత్రియ, ఠాకూర్, రాజ్‌పూత్ కులాలకు చెందిన స్టిక్కర్లను తమ వాహనాలపై అతికించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సమాజానికి తప్పుడు మెసేజ్ ఇచ్చినట్లు అవుతుందని, కుల వివక్ష పెరుగుతుందని, అందుకనే ఆయా వాహనాలపై చర్యలు తీసుకోవాలని లేఖ రాశానని ఉపాధ్యాయుడు ప్రభు తెలిపారు.