త్రివిక్రమ్ సినిమాల్లో కచ్చితంగా ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. అది ఆయన నియమం. ఆయన రాసుకునే కథలు కూడా అలానే ఉంటాయి. ఒకవేళ ఒక హీరోయిన్ తోనే పనైపోతుందని తెలిసినా, మరో హీరోయిన్ ను ఇరికించడం ఆయన స్టైల్. ఇలాంటి ఛాదస్తాలు శేఖర్ కమ్ముల దగ్గర లేవు.
కథకు ఎంతమంది అవసరమో అంతమంది హీరోయిన్లను మాత్రమే ఆయన తీసుకుంటారు. పైగా సదరు హీరోయిన్ కు సెట్స్ పైకి తీసుకెళ్లకముందే వర్క్ షాప్ నిర్వహిస్తారు. కథలో పాత్రకు తగ్గట్టు ఆమెకు ట్రైనింగ్ ఇస్తారు. ఇలా ఎంతో కేర్ తీసుకునే ఈ దర్శకుడు, ఈసారి ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసే పని పెట్టుకున్నాడు.
ధనుష్ తో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు కమ్ముల. దాదాపు పుష్కర కాలం తర్వాత ఓ పొలిటికల్ థ్రిల్లర్ సబ్జెక్ట్ రాసుకున్నాడు. ఓ స్కాం చుట్టూ తిరిగే ఈ కథకు ఇద్దరు హీరోయిన్లు అవసరం అంట. ప్రస్తుతం వాళ్లను ఎంపిక చేసే పనిలో కమ్ముల బిజీగా ఉన్నాడు. ఒక హీరోయిన్ గా సంయుక్త మీనన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఆల్రెడీ ధనుష్ తో సార్ అనే సినిమాలో నటిస్తోంది సంయుక్త. మరోసారి ఆమెను రిపీట్ చేస్తే ధనుష్ ఒప్పుకుంటాడా అనేది చూడాలి. ఇక మెయిన్ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. అప్పుడు హీరోయిన్లపై ఓ క్లారిటీ వస్తుంది.