ఈరోజు రాజశేఖర్ కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఆ విడుదల తేదీ ఏంటనే ఆసక్తి కంటే.. రాజశేఖర్ సినిమా మరోసారి ఓటీటీని మిస్ అయిందనే చర్చ ఎక్కువగా వినిపించింది. ఇంతకీ ఏంటా సినిమా? ఆ ఓటీటీ మేటర్ ఏంటి?
శేఖర్ అనే సినిమా చేశాడు రాజశేఖర్. ఇందులో అతడి గెటప్ కు, రిలీజైన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ చాన్నాళ్ల కిందటే పూర్తయింది. ఇంకా చెప్పాలంటే సింగిల్ షెడ్యూల్ లో దాదాపు 80శాతం షూట్ పూర్తయింది. ఆ తర్వాత మరో షెడ్యూల్ లో టోటల్ సినిమా కంప్లీట్ అయింది.
ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిచేసి, చాన్నాళ్ల కిందటే ఫస్ట్ కాపీ సిద్ధం చేశారు. కానీ థియేటర్లలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే… మంచి ఆఫర్ దొరికితే ఈ సినిమాను నేరుగా ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేద్దామని రాజశేఖర్-జీవిత ఎదురుచూశారు. దీని కోసం వాళ్లు చాలా ప్రయత్నించారు కూడా.
అయితే జీవిత చెప్పిన రేట్లు చూసి ఓటీటీ జనాలు బెంబేలెత్తిపోయారు. అటుఇటుగా 25 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. రాజశేఖర్ సినిమాకు ఈ మొత్తం చాలా ఎక్కువ. అందుకే అంతా తప్పుకున్నారు. ఆ తర్వాత జీవిత రేటు తగ్గించినా, ఎవ్వరూ అటువైపు చూడలేదు. రాజశేఖర్ డైరక్ట్ ఓటీటీ రిలీజ్ ఫార్మాట్ ను మిస్ అవ్వడం, ఇది రెండోసారి.
అలా చాన్నాళ్ల పాటు ఎదురుచూసి, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే మే 20ను రిలీజ్ డేట్ గా ప్రకటించారు. ఇదొక రీమేక్ సినిమా. మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమాకు రీమేక్. రాజశేఖర్ ఇందులో 2 షేడ్స్ లో కనిపించబోతున్నాడు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.