జనసేనలో 'సెల్ఫ్ డబ్బా'!

ఈనెల 14తో జనసేనకు నాలుగేళ్లు పూర్తి. ఈ నాలుగు క్యాలెండర్ల గ్యాప్ లో పార్టీ ఏమేం సాధించింది.. భవిష్యత్తు మీద దానికున్న క్లారిటీ ఎంత.. విస్తరణ ప్రణాళికలు ఏమిటి.. లాంటి ప్రశ్నలకు గుంటూరు ప్లీనరీలో స్పష్టత దొరికే ఛాన్సుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ దిశగా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అనేకానేక వేదికల మీద పవర్ స్టార్ తన ‘రాజకీయ మనసును’ ఆవిష్కరించుకున్నారు. ఎటువంటి సమాజం కోసం తాను పరితపిస్తున్నారో విడమర్చి చెప్పుకున్నారు. కానీ.. గుంటూరు ప్లీనరీలో ‘అంతకు మించి’ స్పష్టత దొరకవచ్చని ఏపీ పొలిటికల్ సర్కిల్స్ ఆశిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మిగతా పార్టీలన్నీ ‘హోదాపోరు’ మీద నిమగ్నమై ఉన్న క్రమంలో.. తన వైపు దృష్టి మళ్ళించుకోవాల్సిన అవసరాన్ని జనసేన గుర్తించింది. ‘సెల్ఫ్ ఎక్స్‌పోజింగ్’ అనే కొత్త ఎత్తుగడకు తెర తీసింది పార్టీ యంత్రాంగం. ఇందులో భాగమే.. ‘మంగళగిరి సొంతింటి కల’!

శంకుస్థాపన కార్యక్రమానికి సతీసమేతంగా హాజరైన పవన్ కళ్యాణ్.. మీడియా అటెన్షన్ ని సొంతం చేసుకున్నారు. ప్లీనరీకి సరిగ్గా రెండురోజుల ముందే ఈ ప్రోగామ్ పెట్టుకోవడం ద్వారా.. గుంటూరు సభకు కర్టెన్స్ రైజ్ చేసుకోగలిగింది జనసేన. తాజాగా.. జనసేన సోషల్ మీడియా విభాగం ‘శతఘ్ని’.. ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ”ఒక్క ప్రజాప్రతినిధి లేని ప్రస్థానంలో ప్రజా సమస్యలపై మీరు చేసిన కృషి, మీరు నడిపిన రాజకీయం భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుంది ‘పవన్ అన్న’ ! అంటూ శతఘ్ని పోస్ట్ చేసిన ఈ పాంప్లెట్ మీద విచిత్రమైన కామెంట్లు పడిపోతున్నాయి. ‘మీ సార్ ని మీరే పొగుడుకోవడం కొత్త స్ట్రాటజీయా” అనే ప్రశ్నలకు శతఘ్ని దగ్గర సమాధానం లేకపోయింది.


మరోవైపు.. పార్టీ ఆవిర్భావ సభను జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జరుగుతున్న ఏర్పాట్లను అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. అనేక మార్పులు ప్రతిపాదించారు. సభకు తరలివచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నది పీకే జారీ చేసిన ఆదేశం. ఒక్కో జిల్లా నుంచి కనీసం పదివేల మంది జనసైన్యానికి ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత సమావేశంలా కాకుండా ఒక బహిరంగ సభగా దీన్ని ప్లాన్ చేయడంతో అనూహ్యంగా జనం తరలి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని జనసేన భావిస్తోంది.