అగ్నిపథ్ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అగ్నిపథ్ ను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసకాండ సృష్టించారు ఆర్మీ అభ్యర్ధులు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఆందోలనకారులు ఓ వాట్సప్ గ్రూప్ ద్వారా అందరు ఒక దగ్గరకు చేరినట్టు గుర్తించారు. ఆర్మీ 17/6 పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి.. అందులో జరిపిన చాటింగ్, వాయిస్ మెసేజ్ లు, సెల్ఫీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గురువారం రాత్రి సికింద్రాబాద్ చేరుకున్న కొందరు శిక్షణ కేంద్రం నిర్వాహకులు.. అభ్యర్థులు స్టేషన్ ఎదురుగా సెల్ఫీలు దిగి.. వారి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. మిగతా నిర్వాహకులు, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలంటూ పోస్టులు పెట్టారు. శుక్రవారం ఉదయం స్టేషన్ లో ఆందోళన ప్రారంభమైన కొంత సేపటి వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇంతలో ఒకరు ‘‘ఎంత సేపు ఒర్లుతరు.. ఒర్లిఒర్లి నోర్లు నొస్తయ్. గమ్మునపోయి పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టేసినమనుకో.. న్యూస్ బయటికి పోతది. అంతేగాని.. ఎంతసేపు ఒర్లినా, ఎంతసేపు బ్యానర్లు చూపించినా.. ఎంత మొత్తుకున్నా ఏం అవ్వదు. గంట, రెండు గంటల్లో స్క్వాడ్ వస్తది. అందర్ని ఎల్లగొట్టేస్తారు. అందుకే పెట్రోల్ బంకు పోయి పెట్రోల్ తీసుకొస్తే మొత్తం తగలబెట్టొచ్చు రెండు నిమిషాల్ల’’ అని వాట్సాప్ గ్రూప్‌లో వాయిస్ మెసేజ్ పోస్ట్ చేసి ఆందోళనకారుల్ని రెచ్చగొట్టినట్టు గుర్తించారు.
అయితే.. దానికి బదులుగా మరొ వ్యక్తి స్పందిస్తూ.. ‘‘నేను పెట్రోల్ తెచ్చేందుకు బంకుకు పోతున్నా.. ఎవరైనా వస్తే రండి’’ అని వాయిస్ మెసేజ్ పోస్ట్ చేశాడు. ఈ ఆధారాలను బట్టి విధ్వంసానికి ఉసిగొల్పినవారిని పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 17/6 గ్రూప్ ను ఏర్పాటు చేయడానికి కారణాలేమిటి..? బయటి శక్తులేమైనా ఉన్నాయా..? అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.