రోజు మాదిరిగానే ఆ బామ్మ తన పొలం పనులకు బయలుదేరింది. తను వెళ్లే దారిలో ఓ రైల్వే ట్రాక్ ఉంది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న బామ్మ రైలు పట్టా విరిగి ఉండటాన్ని గమనించింది. అయ్యో రైలు వస్తే పెద్ద ప్రమాదమే జరుగుతుంది కదా అనుకుంది. అధికారులకు సమాచారం ఇవ్వటానికి కనీసం తనతో ఫోన్ కూడా లేదు. ఇప్పుడేలా అనుకునే లోపే.. రైలు కూత వినబడింది. వెంటనే బామ్మ సమయస్పూర్తితో వ్యవహరించి.. రైలు ఆపేందుకు తన ఒంటిపై ఉన్న ఎర్ర చీరనే అస్త్రంగా వాడింది. వేలాది మంది ప్రాణాలు కాపాడి.. అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలో చోటుచేసుకుంది.
యూపీలోని ఎటా జిల్లా అవాగఢ్ మండలంలోని గులేరియా గ్రామంలో ఓంవతీ దేవి(65) అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. తన ఇంటి నుంచి పొలానికి వెళ్లే దారిలో రైల్వే ట్రాక్ ఉంటుంది. రోజు పొలం పనులకు వెళ్లాలంటే ఆ ట్రాక్ దాటుకుని వెళ్లాలి. గురువారం ఇంటి నుంచి రైలు పట్టాల మీదగా పొలానికి వెళ్తుండగా.. కుస్బా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక పట్టా విరిగి ఉండడాన్ని గమనించింది. రైలు వస్తే ప్రమాదం జరుగుతుందని గ్రహించిన ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. ఎలాగైనా ప్రమాదాన్ని నివారించాలని అనుకుంది.
అయితే, ఈ సమాచారం సంబంధిత సిబ్బందికి ఎలా తెలియచేయాలో ఓంవతీ దేవికి తెలియలేదు. కనీసం ఆమె వద్ద ఫోన్ కూడా లేదు. ఎవరినైనా పిలుచుకు వచ్చేంతా ట్రైం కూడా లేదు. ఇంతలోనే దూరంగా రైలు కూత వినిపించింది. దీంతో అలర్ట్ అయిన ఆమె బాగా ఆలోచించి.. తన ఒంటిపై ఎర్ర చీరనే అస్త్రంగా చేసుకుంది. చీర విప్పి పట్టాలపై నిల్చుని జెండాలా ఊపడం ప్రారంభించింది. పక్కనున్న రెండు చెట్టు కొమ్మలు విరగ్గొట్టి.. పట్టాలకు అడ్డంగా ఎర్ర చీరను కట్టింది.
కాసేపటికే ఎటా నుంచి టుండ్లా వెళ్తున్న పాసింజర్ రైలు వచ్చింది. పట్టాలకు అడ్డంగా ఎర్ర వస్త్రం ఉండడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. రైలు ఆగిన వెంటనే దిగి చూస్తే పట్టా విరిగి ఉంది. పక్కనే ఓంవతీ దేవి కనిపించింది. రైలు పట్టా దెబ్బతిన్నట్టు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు ట్రైన్ డ్రైవర్. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి.. విరిగిన రైలు పట్టాను సరిచేశారు. గంట తర్వాత రైలు ప్రయాణం తిరిగి ప్రారంభమైంది.
ఇంతకుముందు టుండ్లా నుంచి ఎటాకు ఇదే రైలు వెళ్లిందని, అప్పుడే పట్టా దెబ్బతిని ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ట్రాక్‌ను పరిశీలించిన లైన్‌మ్యాన్ అంతా బాగుందని చెప్పాడని అన్నారు. కానీ పట్టా ఎప్పుడు విరిగిపోయి ఉంటుందో తెలియదన్నారు. ఓంవతీ దేవిపై అనేక మంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓంవతీ హర్షం వ్యక్తం చేసింది.