మహారాష్ట్ర మంత్రి, శివసేన రెబెల్ నేత సందీపన్ భూమ్రే బాంబు పేల్చారు. బీజేపీతో కలిసి శివసేన తిరుగుబాటు నేతలు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భూమ్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు నేతలంతా కలిసి ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు మంగళ వారం తిరుగుబాటు నేతలు బస చేసిన సూరత్, బుధవారం బస చేస్తున్న అసోంలు రెండూ బీజేపీ పాలిత ప్రాంతాలు కావడం గమనార్హం.
దీంతో బీజేపీతో కలిసి తమ తిరుగుబాటు వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే పరోక్ష సంకేతాలను ఇచ్చారని రాజకీయ పండితులు చెబుతున్నారు.
మరోవైపు తమ వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏక్ నాథ్ షిండే చెబుతున్నారు. త్వరలో మరి కొందరు నేతలు తమ వర్గంలో చేరుతారని ఆయన హింట్ ఇచ్చారు.
పార్టీ శాసన సభ్యుల్లో మూడింట రెండువంతుల మంది మద్దతు ఉంటే షిండే ప్రత్యేక వర్గంగా కొనసాగవచ్చు. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే పార్టీ పిరాయింపుల చట్టం వేటు నుంచి ఆ వర్గం తప్పించుకోవచ్చని రాజకీయ పండితులు చెబుతున్నారు.