శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ షాక్ ఇచ్చింది. పత్రా చౌల్ మనీలాండరింగ్ కేసులో రౌత్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రౌత్ నివాసంలో ఈ రోజు ఉదయం ఈడీ దాడులు చేసింది. మొత్తం 12 మంది ఈడీ అధికారులు దాడిలో పాల్గొన్నారు. సుమారు 7 గంటల పాటు రౌత్ నివాసంలో దాడులు కొనసాగాయి.
ఈ నేపథ్యంలో రౌత్ నివాసం వద్ద పోలీసుల భద్రతను పెంచారు. మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని సంజయ్ రౌత్ కు ఇటీవల ఈడీ రెండు సార్లు నోటీసులు పంపింది. మొదటగా ఈ నెల 20న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు పంపింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను విచారణకు హాజరుకాలేనని రౌత్ తెలిపారు.
ఆ తర్వాత చివరగా ఈ నెల 27 మరోసారి సమన్లు పంపింది. కానీ రెండో సారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో రౌత్ నివాసంలో అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని, ఎవరెన్ని కుట్రలు చేసినా తాను శివసేనను వీడబోనని తెలిపారు.
రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండి పడింది. ఒక వేళ రౌత్ కు ఏ పాపం తెలియదనుకుంటే అతను ఈడీని చూసి ఎందుకు భయపడుతున్నారు. ఆయనకు మీడియా ముందు ప్రెస్ మీట్ లకు హాజరయ్యే సమయం ఉంటుంది కానీ ఈడీ ఎదుట హాజరు కావడానికి సమయం దొరకలేదా అన్ని ప్రశ్నించింది.