సీనియర్ నటుడు, తెలుగులో నిర్మాతగా అనేక సినిమాలు సైతం నిర్మించిన కాస్ట్యూమ్స్ కృష్ణ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని తన స్వగృహంలో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన కాస్ట్యూమ్ కృష్ణ 80-90లలో టాలీవుడ్ సహా దక్షిణాది సినిమాల్లోని హీరో హీరోయిన్లకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు.
ఆ తరువాత ఆయనలో నటుడు ఉన్నాడని గుర్తించిన కోడి రామకృష్ణ ఆయనకు నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో కృష నటుడిగా మారారు. ఇక ఆ తర్వాత పెళ్లి పందిరి అనే సినిమాని నిర్మించడమే కాకుండా అందులో నటుడిగా సైతం నటించారు. పెళ్ళాం చెబితే వినాలి. అల్లరి మొగుడు, దేవుళ్ళు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి వంటి సినిమాల్లో ఆయన నటనకుగాను తనదైన శైలిలో అందరిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
విజయనగరం ప్రాంతానికి చెందిన కాస్ట్యూమ్స్ కృష్ణ సినిమాల మీద ఆసక్తితో 1954లోనే మద్రాసు వెళ్లి అక్కడ అసిస్టెంట్ కాస్ట్యూమర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు. అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమర్ గా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ రామానాయుడు సంస్థలో ఫుల్ టైం కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేవారు. అలా రామానాయుడు సంస్థ ద్వారా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి వంటి హీరోల మొదలు వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్స్ వరకు చాలా మందికి కాస్ట్యూమ్స్ అందించి కాస్ట్యూమ్స్ కృష్ణ గా పేరు తెచ్చుకున్నారు.
అప్పటి ట్రెండ్లకు తగినట్టుగా హీరోలకు బెల్ బాటమ్, నుంచి బ్యాగి పాయింట్లు వరకు అలాగే హీరోయిన్లకు చీర కట్టులో రకరకాల స్టైల్స్ ఆయన ఆధ్వర్యంలో అప్పట్లో అవి ఒక ట్రెండ్ సెట్ చేశాయి. చాలా సంవత్సరాలు అవే ట్రెండ్స్ కనిపిస్తూ ఉండేవి.
నిజానికి ఆయన ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ పని మీద దృష్టి పెట్టి పనిచేస్తూనే ఉండేవారట. ఖాళీ లేకుండా కనీసం కుటుంబంతో గడిపే సమయం కూడా లేకుండా బిజీబిజీగా గడిపే వారట అలా ఆయన బిజీబిజీగా గడుపుతున్న సమయంలోనే కృష్ణ ఆకారం, బాడీ లాంగ్వేజ్ చూసి ఏదో ప్రత్యేకత ఉందని భావించి కోడి రామకృష్ణ సినిమాల్లో నటించమని కోరడంతో మొదటి సినిమా భారత్ బంద్ లోనే ఆయన విలన్ గా నటించారు. ఆ తర్వాత నటుడిగా అనేక సినిమాల్లో నటించడమే కాదు నిర్మాతగా కూడా పలు సినిమాలు చేశారు.