సీనియర్ యాక్టర్ నరేష్ మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై గతంలోనే ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారు. పలు యూట్యూబ్ ఛానెళ్లపై ఫిర్యాదు కూడా చేశారు. తమపై అసత్య ప్రచారాలు చేస్తూ, ట్రోల్ చేస్తున్నాయని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తన బెడ్రూమ్ లోకి తొంగిచూసినట్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి పలు ఆధారాలనూ ఆయన పోలీసులకు అందజేశారు.
అయితే ఈ కేసులో విచారణ ఎంతవరకు వచ్చిందనేది తెలుసుకోవడానికి నరేష్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సినీ పరిశ్రమ, మీడియా కలిసి పని చేయాలని ఈ సందర్భంగా నరేష్ కోరారు.
కాగా సినీ నటి పవిత్ర లోకేష్ తో తన బంధం గురించి నరేష్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అంతకుముందు నుంచే పలు సందర్భాలలో ఇద్దరూ కలిసి కనిపించడంతో రకరకాల ప్రచారం జరిగింది. యూట్యూబ్ ఛానెళ్లు వీళ్ల బంధంపై పుకార్లను ప్రసారం చేశాయి. కొన్నాళ్లపాటు ఈ జంట సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.