సీనియర్ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని గిండి ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లోని స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సోమవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు శరత్ బాబు. సోమవారం రాత్రి 9.30 వరకూ శరత్ బాబు భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. అక్కడ పలువురు సినీ ప్రముఖులు శరత్ బాబుకు నివాళులర్పించారు.
ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఆయన్ని చెన్నైలోని నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం త్యాగరాయ నగర్ లోని నివాసంలో మధ్యాహ్నం వరకు ఉంచారు. ఆయన్ని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలి వచ్చారు. అనంతరం గిండి ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లోని స్మశాన వాటికలో శరత్ బాబు అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. శరత్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని తెలిపారు. నటుడు కాకముందు నుంచి ఆయనతో తనకు పరిచయం ఉందని.. తనపట్ల ఎంతో ఆప్యాయంగా ఉండేవాడని తెలిపారు. శరత్ బాబు తనకు అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. శరత్ మృతి తనను కలచివేసిందని రజనీ చెప్పారు.
ఆయన ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉండేవారని, కోపంగా ఉండటాన్ని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నో సినిమాల్లో ఇద్దరం కలిసి నటించామని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలని, సిగరెట్లు తాగొద్దని నాకు ఎన్నోసార్లు చెప్పేవాడని తెలిపారు. శరత్ బాబు మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు రజనీకాంత్.