చెన్నయ్: అలనాటి హీరోయిన్ భానుప్రియను బాల కార్మిక నేరం కేసు నిను వీడని నీడను నేనే అంటూ వెంటాడుతోంది. భానుప్రియను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సామర్లకోట పోలీసులు గతంలో భానుప్రియపై నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి వచ్చింది. చెన్నైలో భానుప్రియ తన ఇంటి పని కోసం మైనర్ బాలికలను నియమించుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నది. పనిపిల్ల తన ఇంట్లో చోరీకి పాల్పడిందని జనవరి 19న పాండిబజార్ పోలీస్‌స్టేషన్‌లో భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేశారు. అయితే పనిపిల్ల తల్లి ప్రభావతి రివర్స్ కేసు పెట్టింది. సామర్లకోట పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపీకృష్ణన్లపై ఫిర్యాదు చేసింది. తన కూతుర్ని ఇంట్లో నిర్బంధించి చిత్రవధకు గురి చేశారని, రక్షించమని చేసిన ఫిర్యాదు మేరకు సామర్లకోట పోలీసులు చెన్నైకి వచ్చి నటి భానుప్రియను విచారించారు.
అప్పుడే భానుప్రియ పెట్టిన కేసులో చెన్నై, పాండిబజార్ పోలీసులు పనిపిల్ల, తల్లి ప్రభావతిని అరెస్ట్ చేసి విచారించారు. తాజాగా సామర్లకోట పోలీసులు నటి భానుప్రియ కేసును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చారు. నేరం జరిగింది చెన్నైలో అయినందున నటి భానుప్రియపై బాల కార్మిక చట్టం కింద సామర్లకోట పోలీసులు నమోదు చేసిన కేసును చెన్నై పోలీసులకు ఇటీవల అప్పగించారు. దీంతో చెన్నై, పాండిబజార్ పోలీసులు ఆ కేసుకు సంబంధించి నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు ఏ క్షణంలోనైనా భానుప్రియను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.