బీజేపీ సీనియర్ నేత, బెంగాల్ మాజీ గవర్నర్ కేషరీనాథ్ త్రిపాఠి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్ రాజ్ లోని తన నివాసంలో ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు. గత నెల రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
గత నెల 8న బాతు రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన చేయి విరిగింది. మూత్ర విసర్జన సరిగా లేకపోడం, సాధారణ బలహీనత వంటి కారణాలతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో వారం రోజులు పాటు ఆయన చికిత్స పొందారు. అనంతరం ఆయన్ని ఇంటికి తీసుకు వచ్చారు.
కేషరీనాథ్ త్రిపాఠి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేషరీ నాథ్ త్రిపాఠికి రాజ్యాంగ సంబంధ విషయాల్లో గొప్ప ప్రావీణ్యం ఉందన్నారు. యూపీలో బీజేపీ నిర్మాణంలో ఆయన చాలా కీలకపాత్ర పోషించి రాష్ట్ర ప్రగతికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణ వార్త తెలిసి బాధపడ్డానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.
నవంబర్ 10, 1934న అలహాబాద్‌లో త్రిపాఠి జన్మించారు. జూలై 2014 నుండి జూలై 2019 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఆయన పనిచేశారు. త్రిపాఠి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఆరుసార్లు ఆయన ఎన్నికయ్యారు. మూడు పర్యాయలు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.