కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. అక్టోబర్ 1న కరోనా వైరస్ బారినపడిన ఆయన.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం ఉదయం 3.30 గంటలకు తన తండ్రి మరణించినట్టుగా ఆయన తనయుడు ఫైసల్ పటేల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆహ్మద్ పటేల్ వయస్సు 71 సంవత్సరాలు.
@ahmedpatel pic.twitter.com/7bboZbQ2A6
— Faisal Patel (@mfaisalpatel) November 24, 2020
కరోనా వైరస్ నిర్ధారణ అయిన తర్వాత కొద్ది రోజుల పాటు అహ్మద్ పటేల్ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కానీ రోజులు గడిచినా నయం కాకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. వైరస్ తగ్గకపోగా.. మరింత ఎక్కువ కావడంతో ఆయన శరీరంలోని పలు అవయవాలు సరిగా పని చేయని స్థితికి చేరుకున్నారు. ఈ నెల 15 నుంచి ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణించి అహ్మద్ పటేల్ మృతి చెందారు.
అహ్మద్ పటేల్ మొత్తం ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మూడుసార్లు లోక్‌సభకు, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా, సోనియాగాంధీకి నమ్మకస్తుడిగా అహ్మద్ పటేల్ మెలిగారు.