కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మరోసారి సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే పార్టీ అధ్యక్షురాలు గాంధీపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ లేఖ రాసిన వారిలో ఒకరుగా ఉన్న కపిల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై అసంతృప్తి వెళ్లగక్కారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా చూడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కమ్యూనికేషన్ విప్లవానికి అనుగుణంగా కాంగ్రెస్ వ్యూహాలు లేవన్న ఆయన.. ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కొత్త మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇటీవల బిహార్ ఎన్నికల్లో కూడా ఆర్జేడీనే ప్రత్యామ్నాయంగా చూశారే తప్ప.. కాంగ్రెస్‌ను కాదన్నారు సిబల్. గుజరాత్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమిపాలైందని… అక్కడ ఒక్క సీటు కూడా రాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఇక యూపీలో జరిగిన బై పోల్‌లోనూ కాంగ్రెస్‌ను పట్టించుకోలేదని ఆయన అన్నారు. అక్కడ తమ పార్టీకి 2 శాతం ఓట్లు కూడా రాలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ అపజయాలపై అవలోకనం చేసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉందని కపిల్ సిబల్ తెలిపారు. కపిల్ సిబల్ వ్యాఖ్యలను చూస్తోంటే.. ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం ఇంకా సమసిపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.