సోమాలియాలో సీనియర్ ఐసిస్ నేత బిలాల్-అల్ సూడానీ హతమయ్యాడు. ఉత్తర సోమాలియాలో పర్వత ప్రాంతాల్లో అతడిని పట్టుకోవడానికి అమెరికా సైనిక బలగాలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కాల్పులు జరిపి అతడిని మట్టుబెట్టాయి. ఇతనితో బాటు ఇతని ఇస్లామిక్ స్టేట్ సహచరులైన మరో పదిమందికూడా కాల్పుల్లో మరణించారు. అధ్యక్షుడు జోబైడెన్ ఆదేశాలపై ఈ నెల 25 న అమెరికా సేనలు ఒక్కసారిగా ‘అసాల్ట్ ఆపరేషన్’ ను చేబట్టాయని, ఐసిస్ నేతను, అతని సహచరులను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. వారు ఎదురు దాడికి దిగారని రక్షణ మంత్రి ల్యాడ్ ఆస్టిన్ తెలిపారు.
ఆఫ్ఘానిస్తాన్ సహా ఆఫ్రికాలోను, ఇతర దేశాల్లోనూ ఐసిస్ కార్యకలాపాలు పెరిగిపోవడానికి, ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థకు నిధులందజేయడానికి బిలాల్-అల్ సూడానీ కారకుడని ఆయన చెప్పారు. నార్తర్న్ సోమాలియాలోని పర్వత ప్రాంతాల్లో దాక్కున్న ఇతడిని సజీవంగా పట్టుకునేందుకు అమెరికా ఎంతోకాలంగా ప్రయత్నిస్తూ వస్తోంది.
ముఖ్యంగా ఆఫ్ఘానిస్తాన్ లో ‘ఖొరాసాన్ ఇస్లామిక్ స్టేట్’ కార్యకలాపాలను వ్యాప్తి చెందింపజేయడానికి బిలాల్ కృషి చేస్తూ వచ్చాడని అమెరికా అధికారులు తెలిపారు. పదేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్ లో చేరడానికి ముందు సోమాలియాలో తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న అల్-షబాబ్ ఉద్యమాన్ని చేబట్టిన ఇతగాడు.. ఫైటర్ల రిక్రూట్మెంట్, శిక్షణ వంటి కార్యక్రమాలను చేబట్టాడని వారు చెప్పారు.
ఇతడిని పట్టుకోవడానికి అమెరికా దళాలు కొన్ని నెలల పాటు సోమాలియా ఉత్తర ప్రాంతాల్లో ‘రిహార్సల్స్’ చేశాయట. ఉన్నత స్థాయి రక్షణ, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ అధికారులతో జరిపిన సమావేశంలో.. ఇతడిపై దాడి చేయడానికి గల అధికారాలను బైడెన్ వీరికి ఇచ్చినట్టు ఓ వార్తా సంస్థ తెలిపింది. అమెరికన్లకు హాని కలిగించేవారు ఎక్కడ దాక్కున్నా వారిని అంతం చేయాలన్నది బైడెన్ లక్ష్యంగా ఉందని ఈ సంస్థ పేర్కొంది.