మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బెస్ట్ చిత్రంగా నిలిచింది ఖైదీ. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1983లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన సుమలత, మాధవి లు నటించారు. రావు గోపాల్ రావు, చలపతిరావు, నూతన ప్రసాద్, రంగనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ప్రముఖ నిర్మాత ధనంజయ రెడ్డి, నర్సారెడ్డి, సుధాకర్ రెడ్డిలు ఈ సినిమాను నిర్మించగా పరుచూరి బ్రదర్స్ కథను అందించారు. నిజానికి ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం చిరంజీవి కెరీర్ నే మార్చేసింది. చిరంజీవి లోని కొత్త నటుడు అందరికీ ఈ సినిమాతో పరిచయం అయ్యాడు.
కాగా తాజాగా సీనియర్ జర్నలిస్టు రామారావు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖైదీ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తెరకెక్కించే సమయంలో దర్శకనిర్మాతల మధ్య పెద్ద గొడవ జరిగిందని, మొదట ఈ సినిమాను సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ తో తెరకెక్కించాలని అనుకున్నారని కానీ కృష్ణ కి కథ నచ్చక పోవడంతో చిరు చేశాడని తెలిపారు.
అయితే నిర్మాత ధనుంజయరెడ్డి… స్టార్ హీరోతో సినిమా చేయాలంటే వారు చెప్పినట్లు వినాల్సి ఉంటుందని అలా కాకుండా అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరో లను ఎంపిక చేస్తే బాగుంటుందని ఆలోచించారట. ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మెగాస్టార్ చిరంజీవి కి వినిపించారట.
నువ్వు నాకు నచ్చావ్ మిస్ చేసుకున్న హీరో… ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ?
చిరంజీవి కూడా నచ్చలేదని మొదటి చెప్పారట. ఆ తరువాత చిరు దగ్గరుండి తనకు నచ్చినట్లు కొన్ని మార్పులు చెప్పి పట్టాలెక్కించారట. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది.
చిరంజీవి కెరీర్ ను ఖైదీ చిత్రంకు ముందు ఖైదీ చిత్రంకు తరువాత గా మార్చేసింది. అప్పట్లోనే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది ఈ చిత్రం. అంతేకాకుండా 8 కోట్ల రూపాయలు వసూలు చేసిన రెండవ చిత్రంగా కూడా ఖైదీ రికార్డులకెక్కింది.
విశేషం ఏంటంటే ఈ సినిమాకు 25 లక్షల రూపాయల బడ్జెట్ ను మాత్రమే పెట్టారట. అలాగే ఈ చిత్రాన్ని హిందీ కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు. బాలీవుడ్లో కూడా ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరో జితేందర్ ఈ సినిమాలో హీరోగా నటించారు.