ఏదీ గెలుపు... ఏదీ ఓటమి...? - Tolivelugu

ఏదీ గెలుపు… ఏదీ ఓటమి…?

సతీష్‌ కమల్, సీనీయర్ జర్నలిస్ట్

ప్రతీ విషయానికి ఒక లాజికల్ ఎండ్ ఉంటది…దానికి గెలుపోటములతో సంబంధం ఉండదు. విద్యుత్ ఉద్యమ సమయంలో బషీర్ బాగ్ పోలీసు కాల్పుల్లో ఉద్యమకారులు చనిపోయారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిరశన దీక్షలను ముగించింది.పోరాటం అసెంబ్లీ వేదికకు మారింది. అధికార తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్, వామపక్ష ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ కొనసాగింది. చివరకు విపక్షాల వాకౌట్ తో విద్యుత్ ఉద్యమానికి తెర పడింది.

జనాల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది.విద్యుత్ ఉద్యమ ముగింపు ఇలా చప్పగా కాకుండా “ఇంకేదైనా” జరిగి క్లోజ్ అవ్వాల్సింది‌ అని జనాల్లో ఆవేశం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో జనాల ఫీడ్ బ్యాక్ ను అప్పుడు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఉన్న వై ఎస్ రాజశేఖరరెడ్డి ముందు పెడితే ఆయన చెప్పిందొకటే…”ప్రతీ విషయానికి ఒక లాజికల్ ఎండ్ ఉంటది…దానికి గెలుపోటములతో సంబంధం ఉండదు. విద్యుత్ ఉద్యమం లో భాగంగా అన్నిరకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం.ఉద్యమకారులు ప్రాణాలు కూడా కోల్పోయారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను,నిరంకుశ పాలనను ఎండగట్టాం.ప్రజాస్వామ్య ‌వ్యవస్థలో ఇంతకన్నా ఏం చేయగలం…? నేను వెళ్ళి చంద్రబాబు ‌చొక్కా లాగి కింద పడేసి కొట్టలేనుగా…!? దానికి అసెంబ్లీ రూల్స్ ఒప్పుకోవుగా…!? మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా… అది అర్ధాంతర‌ ముగింపు ‌అనుకున్నా…ప్రజాస్వామ్య ‌వ్యవస్థ పరిమితుల దృష్ట్యా ఆ పరిణామాలను యాక్సెప్ట్ చేయాలి.మేము ఉద్యమం ఆపేయడం మూలంగా మేము‌ ఓడిపోయామని కాదు…చంద్రబాబు అరాచకపాలనను ప్రజల్లో విజయవంతంగా చర్చకు పెట్టగలిగాం…రేపటి రోజున ప్రజలు తమ తీర్పు ఇవ్వబోయేముందు బాధిత‌ జనాలు మా రాజకీయ పక్షాల పనితీరు ను బేరీజు వేసుకుంటారు” అలాగే ఇప్పటి RTC ఉద్యమం లోనూ యూనియన్లు కొంతమేర వెనక్కి తగ్గడం KCR విజయం ఎంతమాత్రం కాదు.అప్పట్లో ‌మల్లన్న సాగర్ విషయంలోనూ KCR ఇదే రకంగా మొండిగా వ్యవహరించారు. అప్పట్లో కూడా రైతులను పిలిపించి మాట్లాడినా సరిపోయేది కానీ KCR ఈగో అడ్డంకిగా మారింది.ఇప్పుడు RTC విషయంలోనూ KCR చర్చలకు పిలిస్తే సమ్మెకు దిగకుండానే యూనియన్లు విలీన డిమాండ్ గురించి అంతగా పట్టుబట్టే వారు కాదు.కానీ అక్కడ ఉంది KCR…ఆయన ఈగో వెనక బినామీ ఆర్థిక శక్తుల ప్రయోజనాలే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.

మెఘా కృష్ణా రెడ్డి,మై హోం రామేశ్వర రావు, ఒలెక్ట్రా (గోల్డ్ స్టోన్) ప్రసాద్ లకు దోచి పెట్టడానికి KCR ఎంతకైనా తెగిస్తారనే సందేశం తెలంగాణ ప్రజానీకం ముందు RTC సమ్మె మూలంగా తేటతెల్లమైంది.

ఇప్పుడు అందరూ ఆలోచిస్తోంది ఒక్కటే…KCR నిరంకుశ పాలకు తెలంగాణ సమాజం ఎటువంటి ముగింపును ఇస్తుందనే.

Share on facebook
Share on twitter
Share on whatsapp