సీనియర్ జర్నలిస్ట్ సతీష్ చంద్ర, కవి జయరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో సైఫాబాద్ లోని అంబేద్కర్ రీసెర్చ్ కాంప్లెక్స్ లో భారత రాజ్యాంగం వర్సెస్ మనుస్మృతి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి వీరిద్దరు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
అయితే సదస్సు పూర్తి అయిన తరువాత అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లే అవకాశం ఉందని సైఫాబాద్ పోలీసు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మతంపై నమ్మకం లేని వారి సంఖ్య దేశంలో నాలుగు శాతం పెరిగిందని, అమెరికా వంటి అగ్ర దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు మత విశ్వాసం లేని వారు ఉన్నారని సీనియర్ జర్నలిస్ట్ సతీష్ చంద్ర అన్నారు.
మహిళలను కించపర్చే విధంగా మనుస్మృతిలో రాసి ఉందని.. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మాత్రం ఆడవాళ్లకు స్వేచ్ఛనిచ్చారని ఆయన కొనియాడారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ వర్కర్స్ లో ఒకరు కూడా అగ్రకులానికి చెందిన మహిళలు లేరని, దళిత మహిళలకు ప్రతిచోట అవమానం జరుగుతుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో జోగిని వ్యవస్థ, బాల్య వివాహాలు ఇంకా ఉన్నాయని ప్రముఖ రచయిత జూపాక సుభద్ర అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ప్రస్తుతం ఎంతో మంది మహిళలు బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ఇక కుల,మతాలతో కట్టిన గోడలను కూల్చివేయాలని ప్రజాకవి జయరాజ్ అన్నారు.