మహాత్మా గాంధీ.... చివరి రోజు ఎలా గడిచిందంటే.... - Tolivelugu

మహాత్మా గాంధీ…. చివరి రోజు ఎలా గడిచిందంటే….

అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం

మహాత్మాగాంధీ ఓ అధ్భుతం. ఆయన చుట్టూ అనేక వివాదాలు. ఊహించని మరణం. కాల్చింది ఒకరు కాదు. ఇద్దరనే ఆరోపణలు. బుల్లెట్ గాయాలపై ఇప్పటికీ గందరగోళమే. ఇలా అ’సత్యాలు’ అనేకం రాజ్యమేలాయి. ఏలుతున్నాయి. ఏలుతాయి. ఆ విషయాలు పక్కన పెట్టి గాంధీజీ హత్య జరిగిన రోజు ఏం జరిగింది.? ఆరోజు ఆయన రోజువారీ దినచర్య ఎలా ఉంది..?

మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే..:
1948, జనవరి 30, శుక్రవారం, రోజులాగానే మొదలయ్యింది. గాంధీ తెల్లవారుఝాము మూడున్నరకే లేచారు.

ప్రార్థన చేసుకుని.. ఓ రెండు గంటలు కాంగ్రెస్ కొత్త బాధ్యతలు, విధానాల మీద దృష్టి పెట్టి, మిగతావారు లేచే లోపు, ఆరు గంటలకి మళ్ళీ నిద్రకు ఉపక్రమించారు. మళ్ళీ ఎనిమిది గంటలకు లేచారు.

ఎప్పటిలాగే ఆయనకి నూనెతో మాలిష్ జరిగింది. స్నానం చేసాక.. మేక పాలు, ఉడికిన కూరగాయలు, ముల్లంగి, నారింజ రసం ఆరగించారు.

అదే సమయానికి… ఆయన హత్యకు సంబంధించిన వారు… ఢిల్లీ నగరంలో మరో మూల అంటే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్‌ లో నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే, విష్ణు కర్కరే ఇంకా హాయిగా నిద్రపోతూ ఉన్నారు.

ఇక్కడ……..: గాంధీ ఉపాహారం తరువాత, తనని కలవడానికి సపరివారంగా వచ్చిన పాత స్నేహితుడు రుస్తమ్ సోరాబజీతో కాసేపు సంభాషించారు. తరువాత ఢిల్లీలోని ముస్లిం లీడర్లను కలిసి ‘మీ సమ్మతి లేకుండా వార్ధా వెళ్ళలేను’ అని చెప్పారు.

పటేల్‌ను ఎందుకు కలిశారంటే..?:
గాంధీ సన్నిహితులు అయిన సుధీర్ ఘోష్, ప్యారేలాల్ కలిసి లండన్ టైమ్స్‌ లో వచ్చిన వార్త ‘నెహ్రూ, పటేల్ మధ్యన అభిప్రాయబేధాలు’ పై స్పందించమని కోరారు. ఆరోజు సాయంకాలం వారిద్దరి ముందూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని గాంధీ అన్నారు.

అక్కడ…………: బిర్లాహౌస్‌ కి బయలుదేరే ముందు గాడ్సేకి వేరుసెనగలు తినాలనే కోరిక కలిగింది. అతని మిత్రుడు ఆప్టే వాటిని ఎలాగోలా సంపాదించి మిత్రునికి ఇచ్చాడు. అవి తిన్నాక తృప్తిగా బయలుదేరారు.

సాయంత్రం నాలుగు గంటలకి వల్లభాయ్ పటేల్ తన కూతురు మనీబేన్‌ తో సహా గాంధీని కలిసి ప్రార్థనా సమయం.. 5 గంటలు దాటే వరకూ ముచ్చటించారు.

అదే సాయంత్రం నాలుగుంపావుకి గాడ్సే, అతని మిత్రులు టాంగా ఎక్కి కనాట్ ప్లేస్‌ కి వెళ్ళారు. అక్కడి నుండి ఇంకో టాంగా తీసుకుని బిర్లా హౌస్‌ కి బయలుదేరారు. హౌస్‌ కి ముందు రెండు వందల గజాల దూరంలోనే టాంగా ఆపించి దిగారు.

ఇక్కడ గాంధీ.. పటేల్‌తో మాట్లాడుతూనే… ఒకచేత్తో చరఖా చేత పట్టి, మరో చేత్తో ఆభా తెచ్చిపెట్టిన సాయంత్రం భోజనం చేయసాగారు. ప్రార్థనా సభకి ఆలస్యంగా వెళ్ళడం గాంధీకి ఇష్టం ఉండదు. ఈ విషయం గురించి ఆభా ఆందోళన చెందసాగింది. కానీ పటేల్‌కు ఈ విషయం గుర్తు చేసే ధైర్యం ఆమెకి లేదు. పైగా ఆయనకు ‘ఉక్కుమనిషి’ అని పేరు కూడా ఉంది. అలాగని, ఆలస్యం అవుతోందని గాంధీకి చెప్పే ధైర్యమూ లేదు. చివరికి హాలులో ఉన్న జేబు గడియారం తీసి టైము చూపించే ప్రయత్నం చేసారు. అది గమనించిన మనుబెన్ గాంధీకి చెప్పగా ఆయన ప్రార్థనా సభకి 5.10 ని. బయలుదేరారు.

అలా వెళుతుండగానే..
తన సహాయకులైన ఆభా, మను లతో కలిసి నడుస్తూ, వారితో సరదాగా ముచ్చటిస్తూ ప్రార్థనా సభకు చేరుకున్నారు. అక్కడకు చేరాక ప్రజలకు అభివాదం చేసారు.

ఎడమవైపు నుండి నాథూరామ్ గాడ్సే, గాంధీగారి వైపుకి వంగడం చూసి, ఆయన పాదాలకు నమస్కరించ బోతున్నాడని మను భావించింది.

అసలే ఆలస్యం అయిపోయిందనుకుంటే ఇలా మధ్యలో వచ్చి ఇంకా జాగు చేస్తున్నాడని ఆభా కాస్త చిరాకు పడ్డారు. గాడ్సే విసురుగా మనుని తోసుకుంటూ ముందుకి వచ్చాడు.

మను చేతిలో ఉన్న మాల, పుస్తకం రెండూ కిందపడిపోయాయి. అవి తీసుకోవడానికి ఆమె క్రిందకు వంగారు.

అదే సమయంలో గాడ్సే తుపాకీ తీసి ఒకదాని వెనుక ఒకటి.. మూడు గుళ్ళు.. గాంధీ చాతీమీద, పొట్టలోకి దిగేట్టు పేల్చాడు. ఆయన నోటి నుండి “రామ్….రా…మ్” అనే శబ్దాలు వెలువడ్డాయి.

మరుక్షణం ఆయన శరీరం నేలకొరిగిపోయింది. ఆభా వెంటనే ఒరిగిపోతున్న ఆయన తలను తన చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నం చేసారు.

చివరిగా…

(గుజరాతీ ప్రచురణ, పేజీ నెం.540)లో డాక్టర్ అంబేడ్కర్ మాటలతో ముగింపు. ”నా మనస్సులో గాంధీజీ అంటే ప్రేమ ఉంది. ఏది ఏమైనా కానీ, గాంధీజీని వెనుకబడిన ప్రజలు తమ ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించారు. అందుకే ఆయన స్వర్గం నుంచి కూడా ఆశీర్వాదాలు అందిస్తారు”.

Share on facebook
Share on twitter
Share on whatsapp