విజయసారధి, సీనియర్ జర్నలిస్ట్
కచ్చులూరు లాంచీ ప్రమాదంలో ఇంకా పూర్తి స్థాయిలో గల్లంతైన వారి ఆచూకీ దొరకలేదు. 12 మంది మృతదేహాలు మాత్రం లభించాయి. శవాల గాలింపులో గజ ఈతగాళ్ల శక్తి చాలక ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక బృందాలు రప్పిస్తున్నారు. ఈ ఒక్క కారణం చాలు ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో..! గత వారం రోజులుగా గోదావరి వద్ద ఇదే పరిస్థితి. నదీ ప్రవాహం విశాలంగా ఉండే కొవ్వూరు, రాజమండ్రి రేవుల్లోనే నది ప్రవాహం భీతి గొలుపుతుంది. అలాంటిది అత్యంత ఇరుకుగా ఉండే కచ్చులూరు.. దేవీపట్నం వద్ద ప్రవాహ ఉధృతి ఎలా ఉంటుందో ఊహిస్తుంటేనే భయమేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో లాంచీ షికారుకు వెళ్లాడాన్ని ఏ విధంగా సమర్ధించాలి. జనాలకు కూడా బాధ్యత ఉండాలి కదా. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోము. రెడ్ లైట్ క్రాస్ చెయ్యొద్దు అంటే వినము. వరద పోటు సమయంలో నదిలోకి వెళ్లొద్దు అంటే ఖాతరు చెయ్యం. కనీసం ఇలాంటి లాంచీలు ఎక్కే ముందు దానికి పర్మిషన్ ఉందో లేదో చెక్ చెయ్యం. జనాల ఓట్లు కోసమో.. సానుభూతి కోసమో ప్రభుత్వాలు నష్ట పరిహారం చెల్లించొచ్చు గాక. కానీ నిజానికి ఈ ప్రమాదంలో కచ్చితంగా జనాల నిర్లక్ష్యమే ఎక్కువగా కనపడుతుంది. కఠినంగా అనిపించొచ్చు గానీ ఒక్క రూపాయి ప్రజాధనం కూడా వీళ్లకు నష్టపరిహారం ఇవ్వకూడదు. జనాలు హక్కులు కోరేముందు వాళ్ళ బాధ్యత అనేది నిర్వర్తించాలి. కనీసం వాళ్ళ సొంత ప్రాణాల విషయంలో..!