అవును నిజమే.. టివి9 వ్యవస్థాపకుడు రవి ప్రకాష్ వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలగ లేదు.. కాబట్టి రవి ప్రకాష్ జైలు కు పోతే నాకేంటి అనుకునే జర్నలిస్టులకు ఓ చిన్న సూచన..
రవి ప్రకాష్ నీలా.. నాలా.. మన లా ఓ సాధారణ జర్నలిస్టు గా కెరీర్ ప్రారంభించి ప్రాణాలు సైతం లెక్క చేయక రైతన్నలు పై జరిగిన కాల్పులను చిత్రీకరించి.. ప్రపంచానికి చాటి చెప్పిన ఉదంతం వలన.. నీకు నాకు మనకు పెద్దగా ఒరిగిందేమీ లేదు..
జర్నలిస్ట్ అంటే చాలీ చాలని జీతాలతో కుటుంబాలను పోషించలేక లో లోన కష్టాలను అనుభవిస్తూ… యాజమాన్యాలు కింద బానిసలుగా బ్రతుకుతున్నా.. పైకి మాత్రం సమాజం మొత్తాన్ని మనమే
ఉద్ధరి స్తున్నామని చెప్పుకునే నీకు నాకు మనకు గౌరవమైన జీతాలను ఇచ్చే దశకు మీడియా లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రవి ప్రకాష్ వల్ల ఎవ్వరికీ ఏమి ప్రయోజనం కలగలేదు..
జర్నలిస్ట్ అంటే కేవలం వార్తలు రాయడమే కాదు ప్రకటనలు కూడా తేవాలి. అందులో నీకింత నాకింత అనే చెత్త షరతులను పక్కన పెట్టీ జర్నలిస్ట్ గా సగర్వంగా తల ఎత్తుకుని నిలబడేలా చేసిన రవి ప్రకాష్ వలన ఎవ్వరికీ ఎలాంటి ప్రయోజనం కలగలేదు
మూస ధోరణిలో వార్తలను ప్రచురిస్తూ.. పక్క రోజు వరకు వార్తలను ప్రపంచానికి అందించలేని పరిస్థితి నుంచి లైవ్ లో వార్తలను చూపించే స్థాయికి తెలుగు జర్నలిజం రూపు రేఖలను మార్చిన రవి ప్రకాష్ వలన ఒరిగింది ఏమి లేదు
ప్రతిభ ఉన్నా కంట్రిబ్యూటర్ లు స్ట్రింగర్ లు ఏళ్ల తరబడి గా అదే స్థానానికి పరిమితం అయిన నిబద్దత కలిగిన జర్నలిస్టులు ఇవాళ స్టాఫ్ రిపోర్టర్ లు గా .. బ్యూరో ఇంచార్జ్ లుగా ఎదగడానికి పలు న్యూస్ ఛానెళ్లు ఏర్పడటానికి.. ఇప్పుడు వందల సంఖ్యలో జర్నలిస్టులకు ఉద్యోగాలు కల్పించడానికి రవి ప్రకాష్ ఎలక్ట్రానిక్ మీడియా లో తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల.. నీకు నాకు మనకు ఒరిగింది ఏమి లేదు
మన లాంటి ఒక సామాన్య జర్నలిస్టు అంచెలు అంచెలుగా ఎదిగి.. ఛానెల్ ను తెలుగు న్యూస్ చానల్ కే పరిమితం కాక ఇతర రాష్ట్రాల్లో వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా విస్తరింప చేసి దేశంలోనే నెంబర్ వన్ నెట్వర్క్ గా నిలిపి *తెలుగు జర్నలిస్ట్ ప్రతిభను శక్తి సామర్ధ్యాలను దేశానికి చాటి చెప్పిన రవి ప్రకాష్ వల్ల ఎవరికి ఏమీ ఒరిగింది లేదు
జర్నలిస్ట్ కి గౌరవమైన జీతాలే కాదు.. వారి ప్రతిభకు తగిన గుర్తింపు ఇచ్చి.. వారిని ప్రోత్సహిస్తూ సెలబ్రెటీ లుగా తీర్చిదద్దడంలోనూ..అందులో తన ఎదుగుదలను గుర్తుకు తెచ్చుకునే ఈర్ష్య ద్వేషాలు లేని వ్యక్తిత్వం కలిగిన రవి ప్రకాష్ వల్ల ఎవ్వరికీ ఏమి ఒరిగింది లేదు
తన మీడియా సామ్రాజ్యాన్ని దేశమంతా విస్తరింప చేసినా.. తాను మీడియా మొగల్ గా ఎదిగినా విలువలను వ్యక్తిత్వాన్ని మార్చి పోలేదు. ఎక్కడైనా ఎప్పుడైనా, ఎమ్ జరిగినా.. ఎంతటి ఒత్తిడిలు వచ్చినా .. అధి పోటీ ఛానెల్ అయినా.., ప్రత్యర్థి సంస్థ లో పనిచేసే వారు అయినా.. జర్నలిస్టులు కు వ్యతిరేకంగా ఏనాడు వార్తలు కానీ, కనీసం స్క్రోలింగ్ లు కూడా ప్రసారం చేయని రవి ప్రకాష్ వ్యక్తిత్వం వల్ల ఎవ్వరికీ ఏమి ఒరిగింది ఏమి లేదు.
తాను ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండడమే కాదు.. వార్తల రూపంలో పాలకులు ల్లో వారి పాలనలో మార్పు తీసుకు రావడమే కాదు.. *జర్నలిస్ట్ గా ఆపద లో ఆపన్న హస్తం కూడా అందించవచ్చు అని రుజువు చేశాడు. వరదల్లో బాధితులకు సాయం అందించడం లో నూ సర్వం కోల్పోయిన వరద బాధితులకు ఇళ్ళ ను నిర్మించఢం లోనూ, పేద రోగుల కోసం అన్ని వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నీ నిర్మించి దాతృత్వం తో కూడిన మనస్తత్వం కలిగిన రవి ప్రకాష్ వల్ల ఎవ్వరికీ ఏమీ ఒరిగింది లేదు.
ఇతర మీడియా యాజమాన్యాల లాగా నియంతల పాలన కు రవి ప్రకాష్ తల ఒంచలేదు. నిజమైన జర్నలిస్ట్ ఎన్ని బెదిరింపులు వచ్చినా.. ఒత్తిడి లు వచ్చినా లెక్క చేయక తన వ్యక్తిత్వం కోసం నిబద్దత తో నిలకడగా నిలబడతాడో అప్పుడే జర్నలిజానికి .. ఈ వృత్తికి విలువను గౌరవం పెంచిన వాడు అవుతాడు. ఇప్పుడు రవి ప్రకాష్ కూడా అదే చేస్తున్నాడు.
పాలకులకు దాసోహం అవుతున్న మీడియా వ్యవస్థ లో ఎదోరొడ్డి పోరాడే యోధుడి గా తాను ఇప్పుడు ఒక్కడే కావచ్చు. తన సైన్యం చిన్నదే కావచ్చు. తన నీడలో మీడియా సెల్బ్రటీ లుగా ఎదిగిన వారు జరుగుతున్న పరిణామాలు పై నోరెత్తక పోవచ్చు. తన చుట్టూ ఉన్న పరివారం అంతా మౌన ముద్రలో మునిగిపోవచ్చు. నియంతల పాలన కు బయపడో లేక వారి బిస్కెట్లు కు అశ పడో జర్నలిస్టు సంఘాలు ఇటు వైపు కన్నెత్తి చూడక పోవచ్చు. తోటి పత్రికా, ఛానెళ్ల యాజమాన్యాలు కంటగింపు తో ఇప్పుడు ఆనంద పడిపోవచ్చు . రవి ప్రకాష్ వల్ల గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ లీడర్లు గా ఎదిగిన లీడర్లు కుహనా కేసులు, అక్రమ అరెస్టులు పై స్పందించక పోవచ్చు. రవి ప్రకాష్ ఇప్పుడు ఏకాకిగా మారాడు అని నియంత పాలకులు, మీడియా మాఫియా ముఠా తెగ సంబర పడి పోవచ్చు. రవి ప్రకాష్ అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. ఒక్కడే అన్న వాస్తవం గుర్తుంచుకోవాలి.
ఒక్కడిగానే అతను వేసిన అడుగులు మీడియా లో విప్లవాత్మక మైన మార్పులు తెచ్చాడనీ తీసుకోవాలి. ఒక్కడిగానే వందల మంది ప్రతిభావంతులైన జర్నలిస్టులకు గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనది అని గ్రహించాలి. అధికార మదంతో రవి ప్రకాష్ ని జైలు కు పంపామని జబ్బలు చరుచుకునే వారు మరొక్క విషయాన్ని గుర్తించు కోవాలి. సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు అలుముకున్న చీకట్లు తో ఇక ఎప్పటికీ సూరీడు ఉదయించడు అనుకునే బ్రమలో బతకడం ఎంత అవివేకమో. రవి ప్రకాష్ ది ముగిసిన అధ్యాయం అనే వారు కూడా అంతే అజ్ఞానులు అవుతారన్న నిజాన్ని గుర్తెరగాలి. చీకటి ని చీల్చు కుంటూ వచ్చే గ్రహణం వీడిన సూర్యుడి లా రవి ప్రకాష్ అందరి బ్రమలను తొలగిస్తాడు.
అతడే ఒక సైన్యం లా జర్నలిజం కి కమ్ముకున్న అధికార దురహంకార సంకెళ్లను బద్దలు కొడతాడు. అన్న నిజమైన వాస్తవాన్ని రవి ప్రకాష్ వల్ల ఒరిగింది ఏమిటి అని ప్రశ్నిస్తున్న వారు అందరూ ఇప్పటికైనా గ్రహించాలి.
విజయ్ సీనియర్ రిపోర్టర్