తనను పార్టీ నుండి బయటకు పంపే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ హనుమంతరావు. అంబర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పీసీసీ ఆదేశాలతో మంచిర్యాల వెళ్తే.. అక్కడి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు తనకు అవమానించారని అన్నారు.
అయితే.. తనను అవమానపరిచిన ప్రేమ్ సాగర్ రావుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో అతనికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ నోటిసే కాంగ్రెస్ పార్టీలో రచ్చకు కారణం అవుతున్నట్టు తెలుస్తోంది. కానీ.. ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఏమీ లేదంటూ.. వీహెచ్ విమర్శిస్తున్నారు. మంచిర్యాలలో మాకు అవమానం జరిగితే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు.
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం వెంటనే నిర్వహించాలని వీహెచ్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులకు గౌరవం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల కోసం వెళ్తే అవమానించారని.. అయినా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడకపోవడానికి కారణాలు ఏందో అర్ధం కావడం లేదన్నారు. ప్రేమ సాగర్ రావు కొత్త పార్టీ పెడతానని మాట్లాడినప్పటికీ.. క్రమశిక్షణ కమిటీ చూసిచూడనట్టు వదిలేసిందని ఆరోపించారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. గతంలో జగ్గారెడ్డి సైతం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ.. అన్ని తనకు చెప్పి చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అది మరవక ముందో మరో కొల్పారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంగ్రెస్ లో నిత్యం ఏదో మూలన అసంతృప్తి జ్వాలలు రగులుతునే ఉన్నాయి. పైకి పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని చెప్పినప్పటికీ.. అప్పుడప్పుడు ఈ విబేధాలు ఒక్కసారిగా గుప్పుమంటునే ఉన్నాయి.