నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపింది. డిచ్ పల్లి మండలం బర్దిపూర్ శివారులోని తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైనెన్స్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తమను సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారంటూ బీ ఫార్మసీ సెంకడియర్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
కాలేజీకి సంబంధం లేని బయటి వ్యక్తులు కూడా క్యాంపస్ లోకి వస్తున్నారని విద్యార్థినులు తెలిపారు. ఈ విషయాన్ని పలు మార్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకు వెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కొందరు తల్లి దండ్రులు అక్కడికి చేరుకుని విద్యార్థినులతో కలిసి నిరసన తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాగింగ్ ఆరోపణలపై నలుగురు సీనియర్లను కాలేజీ యాజమాన్యం 10 రోజుల పాటు సస్పెండ్ చేసింది. గొడవలకు కారణమైన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని కాలేజీ కరస్పాండెంట్ వెల్లడించారు.
మరోవైపు పోలీసుల తీరుపై విద్యార్థినులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలేశారని చెబుతున్నారు. కళాశాలలో జరిగింది ర్యాగింగ్ కాదని, అక్కడ గొడవ మాత్రమే జరిగిందంటూ పోలీసులు చెబుతున్నారని మండిపడుతున్నారు.
పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. ర్యాగింగ్ విషయంలో తమకు ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదంటున్నారు. అదుపులో తీసుకున్న సమయంలో మాత్రం సీనియర్లపై జూనియర్ విద్యార్థినులు చెప్పులు విసిరారు అని చెబుతున్నారు.