కరోనా వైరస్ ప్రభావం చూపుతున్న తీరు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. వైరస్ ప్రభావం వ్యక్తులను బట్టి మారుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కరోనా కేసు సంచలనం రేపుతోంది. ఐదు నెలల క్రితం కరోనా బారిన పడ్డ ఓ మహిళ ఇప్పటికీ కోలుకోలేదు. వైద్యులు ఎంత ప్రయత్నించినా వైరస్ ను మాత్రం జయించలేకపోతున్నారు. 5 నెలల్లో ఏకంగా 31సార్లు పరీక్షలు చేయగా ప్రతిసారి పాజిటివ్ రావటం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన శారద అనే మహిళ గతేడాది ఆగస్టు నెలాఖరులో కరోనా బారినపడ్డారు. తొలి కరోనా టెస్టు సెప్టెంబర్ మొదటి వారంలో జరగ్గా చివరి టెస్టు ఈ ఏడాది జనవరి 7న జరిగింది. ఈ 5 నెలల కాలంలో పరీక్ష చేసిన ప్రతిసారీ ఆమెకు పాజిటివ్ గానే తేలింది. తొలుత ఆమెకు స్థానికంగా ఉన్న ఆర్బీమ్ ఆసుపత్రిలో చికిత్స అందించగా, తర్వాత అప్నా ఆశ్రమ్ లోని క్వారెంటైన్ కు తరలించారు.
ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఒకేఒక్క కరోనా రోగి శారద, ఆమె ఆరోగ్యంగానే ఉంది. పైగా ఈ 5 నెలలో ఆమె 8కిలోల బరువు కూడా పెరిగింది. కానీ కరోనా నెగెటివ్ మాత్రం రావటం లేదు. దీంతో శారదను జైపూర్‌లోని ప్రముఖ ఆస్పత్రి ఎస్ఎమ్ఎస్ హాస్పిటల్‌కు తరలించేందుకు నిర్ణయించారు.