మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ర ఎన్ కౌంటర్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ కౌంటర్ కేసులో ఆదిలాబాద్ కోర్టు వెల్లడించిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో పోలీసులు వేసిన రివిజన్ పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి.
కేసులో వాదనలు విన్న అనంతరం ఆదిలాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నట్టు జస్టిస్ నాగర్జున నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. 2010 జులై1న అర్ధరాత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం సర్కేపల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది.
ఈ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండేలు మరణించారు. ఈ ఎన్ కౌంటర్ బూటకమని 2012లో ఆజాద్ భార్య పద్మ, హేమచంద్ర భార్య బబిత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో మూడు వారాల క్రితం ఆదిలాబాద్ న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. ఈ ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో పోలీసుల పాత్రపై మూడు నెలల్లోగా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టు ఆదేశించింది.