తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సోమవారం కీలక తీర్పును వెల్లడించింది. రాకేష్ రెడ్డే జయరాంను కుట్ర చేసి హత్య చేశారని కోర్టు పేర్కొంది. ఈ నెల 9న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసులో మరో 11 మందిని ధర్మాసనం నిర్దోషులుగా తేల్చింది. అలాగే ఏసీపీ మల్లారెడ్డి, మరో ఇద్దరు సీఐలను కూడా నిర్దోలుగా ప్రకటించింది కోర్టు.
చిగురుపాటి జయరాం 2019 జనవరి 31న హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాకేష్‌రెడ్డి, విశాల్, శ్రీనివాస్, రౌడీషీటర్ నగేష్ కీలక నిందితులుగా ఉన్నారు. జయరాం కేసులో 23 పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు.
రాకేష్‌రెడ్డిని 1, విశాల్ ను ఏ2, వాచ్ మెన్ శ్రీనివాస్ ను ఏ3, నగేష్ ఏ4గా సినీ నటుడు సూర్య ప్రసాద్ ఏ5గా పోలీసులు చేర్చారు. జయరాం మేనకోడలు శిఖాచౌదరిని 11వ సాక్షిగా చార్జిషీటులో పేర్కొన్నారు. ఆమె స్నేహితుడు సంతోష్ రావును కూడా సాక్షిగా చేర్చారు.
మొత్తం 73 మంది సాక్షులను న్యాయ స్థానం విచారించింది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది. నాలుగేళ్ల విచారణ తర్వాత నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. హనీ ట్రాప్ తో జయరాం హత్యకు కుట్రపన్నిన రాకేష్ రెడ్డి.. జయరాంను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు పక్కా ఆధారాలను చార్జి షీట్ లో జతపరిచారు.