కాంగ్రెస్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజుకో పథకం అంటూ బంగారం లాంటి రాష్ట్రాన్ని సీఎం జగన్ దివాళా తీయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సీఎంను చూస్తే పిచ్చోడి చేతిలో రాయి అనే సామెత గుర్తుకు వస్తోందన్నారు.
అమరావతి రైతులు ఎన్నో రోజులుగా క్రమశిక్షణతో నిరసనలు చేస్తున్నారని చెప్పారు. కనికరించలేని కఠిన మనస్సు ఉన్నోడికి రాజకీయాలు ఏమి తెలుసని ఆమె ఫైర్ అయ్యారు. రౌడీయిజంతో అందరి పై దాడులు చేయిస్తూ అసలు ప్రగతి అనేది ఎక్కడా కనపడని పరిస్థితుల్లో ప్రజలు సీఎం వేధిస్తున్నాడని మండిపడ్డారు.
ఏదైనా ప్రశ్నించినప్పుడు కులాలను అడ్డుపెడుతున్నారన్నారు. ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించని వాడు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడంటూ ఆమె ఎద్దేవా చేశారు. సీఎం అయితే ఏంటని సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించని నీ మాట తాము వినాలని ఎక్కడా లేదుగా అని ప్రశ్నించారు.
తాను ఇక్కడికి వచ్చినప్పుడల్లా తనను ప్రజలు ఆహ్వానిస్తున్నారన్నారు. ఏమి చేయాలనేది ఆలోచిద్దామన్నారు. తన ఇష్టం వచ్చినప్పుడు తాను అక్కడకు వస్తానన్నారు. తనను ఆపే సత్తా ఎవరికీ లేదన్నారు. తాను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానన్నారు.
హెల్త్ యూనివర్శిటీకి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం వల్ల ఆయన పేరు తరగదు,పెరగదన్నారు. జగన్ రెడ్డికి హెల్త్ కండీషన్ సరిగా లేదని, చికిత్స చేయించేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు. తెలంగాణను ముంచేసి అక్కడ అడుక్కు తినే పరిస్థితి తీసుకువచ్చాడన్నారు.