బీజేపీ యువ మోర్చా నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ చార్జ్ షీట్ దాఖలు చేసింది. 20 మందిని నిందితులుగా పేర్కొంటూ బెంగళూరులోని స్పెషల్ కోర్టులో ఎన్ఐఏ ఈ చార్జ్ షీట్ దాఖలు చేసింది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్రలో భాగంగానే ప్రవీణ్ నెట్టారును హత్య చేశారని ఎన్ఐఏ చార్జ్ షీట్ లో పేర్కొంది. సమాజంలో భయాందోళనలు సృష్టించేందుకు, 2047 నాటికి ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే లక్ష్యంతోనే ఈ హత్య చేశారని చార్జ్ షీట్ లో పేర్కొంది. తన లక్ష్యాల కోసం పీఎఫ్ఐ సర్వీస్ టీమ్స్,కిల్లర్ స్క్వాడ్స్ అనే రహస్య బృందాలను ఏర్పాటు చేసినట్టుగా చార్జ్ షీట్ లో పేర్కొన్నారు ఎన్ఐఏ అధికారులు.
ప్రస్తుతం ఎన్ఐఏ చార్జ్ షీట్ లో పేర్కొన్న నిందితుల్లో ఆరుగురు పీఎఫ్ఐ సభ్యులు పరారీలో ఉన్నారు. వీరిలో ఎవరిని పట్టించినా 5 లక్షల రివార్డ్ ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022 జులై 26న మంగళూరులోని పుత్తూరు సుల్లియా రోడ్డులో ప్రవీణ్ నెట్టారు హత్యకు గురయ్యారు. హత్య తర్వాత మంగళూరు, సుళ్య ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇక పిఎఫ్ఐ పై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలోనే.
పిఎఫ్ఐ ని నిషేధించడానికి నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు దాని అనుబంధ సంస్థలపైనా నిషేధాన్ని విధించింది కేంద్రం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నిషేధాన్ని విధించడం జరిగింది. అయితే ఈ ఉగ్రవాద సంస్థ కేరళ,కర్ణాటక సహా పలు రాష్ట్రాలలో పలు హత్యలకు పాల్పడింది. విదేశాల నుంచి హవాలా మార్గాల్లో భారీగా నిధులను సమీకరిస్తున్న ఈ సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఐసిస్,సిమి లాంటి సంస్థలతో సంబంధాలున్నాయి.