– నవీన్ మర్డర్ కేసులో వెలుగులోకి వాస్తవాలు
– రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
– మూడు నెలల ముందు నుంచే హత్యకు ప్లాన్
– స్పాట్ నుంచి నవీన్ శరీర భాగాలు తీసుకెళ్లిన హరిహర
– బ్రాహ్మణపల్లిలో పడేసి పరార్
– ఫ్రెండ్ ఇంటికెళ్లి ఫ్రెష్ అయి తర్వాత టూర్
– వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖకు వెళ్లిన నిందితుడు
– 24న తిరిగొచ్చి నవీన్ శరీరభాగాల సేకరణ.. దహనం
హైదరాబాద్, తొలివెలుగు:రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచిన నేపథ్యంలో వాస్తవాలు బయటపడుతున్నాయి. నవీన్ ను చంపిన హరిహరకృష్ణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నిందితుడిని కస్టడీకి తీసుకుని సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అలాగే.. హత్య జరిగిన రోజు ఉదయం 11 గంటలకు నల్గొండ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మృతుడు నవీన్.. రాత్రి 11 గంటల వరకు ఎవరెవరిని కలిశాడు.. ఎక్కడెక్కడ తిరిగాడో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు పొందుపరిచారు. ప్రేమకి అడ్డున్నాడనే నవీన్ ను హత్య చేశాడు హరిహర. మూడు నెలల ముందే హత్యకు స్కెచ్ వేశాడు. రెండు నెలల క్రితం మలక్ పేట్ సూపర్ మార్కెట్ లో కత్తి కొనుగోలు చేశాడు.
ఈనెల 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ ను చంపేశాడు. హత్యకు ముందు పెద్ద అంబర్ పేట్ వైన్స్ లో మద్యం సేవించిన నవీన్, హరి.. ఆ మత్తులో యువతి విషయంలో గొడవపడ్డారు. ఓఆర్ఆర్ సమీపంలో నిర్మాణుష్య ప్రాంతంలో గొంతునులిమి హత్య చేశాడు నిందితుడు. తర్వాత కత్తితో శరీరాన్ని కోశాడు. తలా, వేళ్లు, దుస్తువులు ఇతర శరీర విడిభాగాలను బ్యాగులో వేసుకొని పరారయ్యాడు. తర్వాత బ్రాహ్మణపల్లి నిర్మాణుష్య ప్రదేశంలో పడేశాడు.
పక్కనే ఉన్న ఫ్రెండ్ హసన్ ఇంటికి వెళ్లి స్నానం చేసి హత్య విషయం చెప్పాడు. మరుసటి రోజు ప్రియురాలికి సైతం హత్య విషయం చెప్పాడు. ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖకు వెళ్లాడు. 24న తిరిగి హైదరాబాద్ కు చేరుకొని నవీన్ శరీర భాగాలను సేకరించి దహనం చేశాడు. 24న సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు హరిహర కృష్ణ.