మందుబాబులం మేం మందుబాబులం.. మందేస్తే మాకు మేమే మహారాజులం. అనే పాట చాలా చార్లు వినే ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో మందుబాబుల రాజ్యమే నడుస్తోందనిపిస్తోంది. అందుకు అద్దం పట్టేలా ఓ సర్వే సంచలన విషయాలను వెలువరించింది. 15 ఏళ్ల వయసు దాటిన వారిపై సర్వే చేసి రిపోర్టు రూపొందించింది ప్లానింగ్ డిపార్ట్‌మెంట్.
రాష్ట్రంలో సగటున 43.3 శాతం మంది మద్యం తాగేవాళ్లు ఉన్నారని నివేదికలో పేర్కొంది. అయితే.. 22 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మంది మద్యం తాగుతున్నట్టు సర్వేలో తేలినట్టు ప్రకటించింది.
కాగా.. మద్యం తాగే వారిలో జనగామ జిల్లా మొదటి ప్లేస్ లో ఉన్నట్లు సర్వేలో వెల్లడించారు. ఈ జిల్లాలో ఏకంగా 60.6 శాతం మంది మద్యం తాగుతున్నట్లు నివేదికలో తెలిపారు అధికారులు. ఆ తర్వాత 58.4 శాతం మందితో యాదాద్రి భువనగిరి జిల్లా రెండవ స్థానంలో ఉండగా.. 56.5 శాతం మందితో మహబూబాబాద్ జిల్లాలు మూడు స్థానంలో ఉన్నట్టు సర్వే రిపోర్టులో పేర్కొన్నారు అధికారులు.
అర్బన్ జిల్లా హైదరాబాద్ లో మాత్రం 28 శాతం మందే ఆల్కహాల్ వినియోగదారులు ఉండడం విశేషం. అయితే పట్టణాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల ప్రజలే ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. 24 గంటలు బెల్ట్ షాపులు అందుబాటులో ఉండటమే అందుకు కారణం అంటున్నారు అధికారులు.