ప్రత్యేక జిల్లా డిమాండ్ పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డికి తలనొప్పిగా మారింది. సామాన్యుల నుంచి మేధావుల దాకా అందరిదీ ఒకటే మాట.. ప్రత్యేక జిల్లా. ఆఖరికి టీఆర్ఎస్ నేతలు సైతం జిల్లా కోసం డిమాండ్ చేస్తుండడంతో ధర్మారెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
అమరవీరుల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పరకాలలోని వ్యాపార వాణిజ్య సంస్థలు, కార్మికులు, కుల, వృత్తి, ప్రజా సంఘాలు జిల్లా కోసం ఉద్యమిస్తున్నాయి. రోజురోజుకీ ప్రజల్లో జిల్లా ఆకాంక్ష పెరిగిపోతోంది. సంఘీభావ ర్యాలీలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ ర్యాలీలకు ఎమ్మెల్యే పథకం పన్నినా.. విమర్శలు ఎదరయి ఫెయిల్ అయింది. అయినా.. జిల్లా ఉద్యమాన్ని అణిచివేయాలని ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
తాజాగా జరిగిన ఎమ్మెల్యే కార్యక్రమానికి స్థానిక టీఆర్ఎస్ నేతలు హాజరు కాలేదు. ఏంటా అని ఆరా తీస్తే.. ధర్మారెడ్డి తీరుపై అసహనంలో ఉన్నారని.. ప్రత్యేక జిల్లాకు మద్దతు తెలుపుతున్నారని తెలిసింది. దీంతో ఈ ఉద్యమాన్ని ఇలాగే వదిలేస్తే.. తన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ధర్మారెడ్డి భావించి.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ పేరుతో జిల్లా సాధన సమితి సభ్యులకు హెచ్చరికలు జారీ చేయించారు. అయినా.. వారు వెనక్కి తగ్గడం లేదు. కేసులు, జైళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోననే ఉత్కంఠ పరకాల కేంద్రంగా కనిపిస్తోంది.