ఒక నగరం.. వారినికో వ్యాన్ డ్రైవర్ అదృశ్యమైపోతాడు. ఎంత వెతికినా ఆ వ్యానూ ఉండదు..మళ్లీ ఆ మనిషీ కనిపించడు.. కట్ చేస్తే 50 కి పైగా డ్రైవర్లు అలాగే మాయమైపోతారు. వరుసగా కంప్లెయింట్లు. అసలేం జరిగిందో పోలీసులకు కూడా అంతుచిక్కదు.. మరికొన్నాళ్ల తర్వాత మరోచోట అలాగే.. ఈసారి ఆటో డ్రైవర్లు కూడా కనిపించకుండా పోతారు. ఆటోలు కనిపించవు.. వారి డెడ్‌బాడీలుకూడా దొరకవు.. అక్కడ కూడా అంతే ఏం జరిగిందో పోలీసులు కనిపెట్టలేకపోతారు.. చదువుతోంటే ఏదో థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతోంది కదా.. కానీ ఇది కథ కాదు నిజం..ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేందర్ శర్మ అనే ఓ ఆయూర్వేదిక్ డాక్టర్ ఆడిన రాక్షస క్రీడ ఇది.
ఒకరు కాదు… ఇద్దరు కాదు.. ఏకంగా వంద మందికి పైగా అమాయకులను అత్యంత దారుణంగా చంపి.. వారి శవాలు కూడా దొరక్కుండా చేసి రెండు దశాబ్దాల పాటు పోలీసులకే సవాల్ విసిరాడు. దేవేందర్ శర్మ దారుణాల గురించి చెప్పుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. అన్ని హత్యలు చేసేలా అతడిని ప్రోత్సహించిన పరిస్థితులు, ఆ తర్వాత అదే తన అలవాటుగా మార్చుకున్న తీరు సినిమాని తలపిస్తుంది.
బిహార్‌లో ఆయుర్వేదీక్ డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్న దేవేంద్ర శర్మ.. 1984లో జైపూర్‌లో క్లీనిక్ పెట్టాడు. హస్తవాసి బాగుండటంతో చాలా మంది రోగులు అతని దగ్గరకు వచ్చేవారు. అయితే ఇంకా డబ్బులు బాగా సంపాదించాలని ఆలోచించిన శర్మ.. 1992లో గ్యాస్ ఎజెన్సీ డీలర్ షిప్ కోసం 11 లక్షల రూపాయలు ఓ సంస్థకు చెల్లించాడు. అయితే రాత్రికే రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో అతని జీవితం తలకిందులైపోతుంది. ఎనిమిదేళ్ల కష్టం ఒక్క రోజులో ఆవిరి కావడంతో.. డబ్బు సంపాదన కోసం అడ్డదారి తొక్కాడు. అలీఘర్‌లో ఓ ఫేక్ గ్యాస్ ఎజెన్సీని పెట్టాడు. మరి సిలిండర్లు కావాలి కదా.. అందుకోసం హత్యలకు ప్లాన్ చేశాడు. గ్యాస్ సిలిండర్లను తీసుకొచ్చే వ్యాన్ డ్రైవర్లను చంపి.. వాటిని తన ఎజెన్సీలోకి తీసుకెళ్లేవాడు. వ్యాన్‌ను తక్కుగా చేసి అమ్మి.. డ్రైవర్ల శవాలను యూపీ కాశీగంజ్‌లోని హజ్రా కెనాల్‌లో పడేసేవాడు. ఆ కెనాల్ మొసళ్లకు పెట్టింది పేరు కావడంతో.. వెంటనే అవి తినేసేవి. దీంతో ఒక్క సాక్ష్యం కూడా మిగలకపోయేది. ఆ తర్వాత ఫేక్ గ్యాస్ ఎజెన్సీ నడిపిస్తున్నాడని అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కొద్ది రోజులు జైలులో ఉండి వచ్చిన శర్మ.. ఈ సారి రూట్ మార్చాడు. ఈసారి ఏకంగా మనుష్యుల కిడ్నీల వ్యాపారం మొదలుపెట్టాడు. ఇందుకోసం ఢిల్లీ నుంచి యూపీ వైపునకు వెళ్లే ఆటో డ్రైవర్లను టార్గెట్ చేశాడు. ఏదో ఒక ఊరికి బేరం మాట్లాడుకొని దారి మధ్యలో వారిని చంపి.. తన పాత ప్లాన్‌ను అమలు చేసేవాడు. వారి నుంచి కిడ్నీ తీసుకొని ఓ ముఠాకు విక్రయించేవాడు.తన కార్యకలాపాల కోసం తన పాత క్లినిక్‌ను కూడా వాడుకునేవాడు. ఇలా దాదాపు 100 మందికి పైగా హత్య చేశాడు. ఓ హత్య కేసు విచారణలో అతని అరాచకాలన్నీ బయపడ్డాయి.
కట్ చేస్తే.. జీవిత ఖైదు అనుభవిస్తున్న డాక్టర్ శర్మ.. ఈ ఏడాది జనవరిలో 20 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చాడు. అయితే ఈసారి కూడా కుదురుగా ఉండలేపోకపోయాడు. ఢిల్లీలోని బాప్‌రైలా అనే ప్రాంతానికి పారిపోయి… అక్కడ ఓ వితంతువును పెళ్లాడి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తాడు. అయితే అతని గురించి తెలిసిన కొందరు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించడంతో.. చివరికి రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు.