కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న ప్రపంచ దేశాలన్నీ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటి వరకు జరిగిన క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ సంకేతాలివ్వటంతో త్వరలోనే మహమ్మారీ నుండి బయట పడొచ్చన్న దైర్యం వచ్చింది. కానీ అనూహ్యంగా బ్రిటన్ లో ఓ వాలంటీర్ పై ప్రయోగంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావటంతో వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేస్తున్నట్లు ఫార్మా సంస్థ అస్ట్రాజెనికా ప్రకటించింది.
అస్ట్రాజెనికా-ఆక్స్ ఫర్డ్ డెవలప్ చేస్తున్న ఈ వైరస్ ను ఇండియాలో పుణేకు చెందిన సీరమ్ ఇన్సిట్యూట్ సంస్థ ప్రొడక్షన్ కోసం లైసెన్స్ పొందింది. అయితే విదేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపి వేసినా… ఇండియాలో కొనసాగిస్తున్నామని, ఇండియాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని సీరమ్ సంస్థ బుధవారమే ప్రకటించింది.
అయితే, భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి అందిన ఆదేశాల మేరకు ఇండియాలోనూ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపేశారు. అయితే, వ్యాక్సిన్ లో లోపం ఉందా…? మరేదైనా కారణంతో యూకే వాలంటీర్ అనారోగ్యానికి గురయ్యారా అన్న అంశంపై ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ బృందం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.