నటీనటులు : అడివి శేష్, శోభిత, సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు
కెమెరా : వంశీ పచ్చి పులుసు
సంగీతం : శ్రీచరణ్ పాకాల
మాటలు : అబ్బూరి రవి
నిర్మాణం : సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు : మహేష్ బాబు, సోనీ పిక్చర్స్
సహ-నిర్మాతలు : అడివి శేష్, శరత్ చంద్ర
దర్శకత్వం : శశి కిరణ్ తిక్క
నిడివి : 149 నిమిషాలు
విడుదల తేది : 3 జూన్ 2022
రేటింగ్ : 3/5
బయోపిక్స్ లో కాస్త అతి కనిపిస్తుంది. ఉన్నదున్నట్టు చూపించే ప్రయత్నం ఎక్కడా జరగదు. అదేంటని అడిగితే సినిమాటిక్ లిబర్టీ అంటారు. ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలి కదా అని రివర్స్ లో ప్రశ్నిస్తారు. ఈ క్రమంలో చరిత్రను వక్రీకరించిన బయోపిక్స్ కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటికీ మినహాయింపు మేజర్ సినిమా. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం, అతడి వీరోచిత పోరాటం ఆధారంగా తెరకెక్కించిన ఈ బయోపిక్ లో కూడా సినిమాటిక్ లిబర్టీలు ఉన్నాయి. కానీ అవి ఎక్కడా సందీప్ జీవితాన్ని పక్కదోవ పట్టించలేదు. ఎక్కడా అతడి వీరోచిత పోరాటాన్ని తక్కువ చేసి చూపించలేదు. అందుకే ఇది ట్రూ బయోపిక్ అనిపించుకుంటుంది.
ముంబై దాడుల్లో వీరమరణం పొందాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆ తర్వాత అతడి గురించి చాలా కథనాలు వచ్చాయి. ప్రతి పత్రికలో ఆర్టికల్స్ వచ్చాయి. కాబట్టి అతడి గురించి ప్రత్యేకంగా తెలుకుకోవాల్సిన అంశాలేం లేవనుకుంటారు చాలామంది. కానీ ఓ వీరుడు తన మరణంలోనే కాదు, తన జీవితంలో కూడా అంతే వీరత్వంతో ఉంటాడు. నలుగురికి ఆదర్శంగా జీవిస్తాడు. సందీప్ జీవితం అలాంటిదే. అందుకే దీన్ని సినిమాగా తీసి దేశానికి చూపించాలనుకున్నాడు అడివి శేష్. చెప్పినంత పని చేశాడు కూడా.
సందీప్ చిన్నతనం, టీనేజ్, భార్యతో రొమాన్స్.. ఇలా అతడి రియల్ లైఫ్ లోని చాలా సన్నివేశాల్ని మేజర్ లో టచ్ చేశారు. ఇంట్లో సమస్య వచ్చినప్పుడు సందీప్ ఇంటికి రావడం, తిరిగి ముంబై తాజ్ హోటల్ పై దాడి జరిగినప్పుడు అక్కడికి వెళ్లడం లాంటివన్నీ సహజంగా చూపించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రపంచం మొత్తానికి తెలుసు.
అయితే ఇలా సహజంగా తీసిన సన్నివేశాల్ని కూడా క్లైమాక్స్ లో ఇంటర్ లింక్ చేసి చూపించడం ఈ బయోపిక్ ప్రత్యేకత. బ్యాక్ అండ్ ఫోర్త్ నెరేషన్ లో చూపించిన ఈ సన్నివేశాలు, అలా చూపించిన విధానం ఆకట్టుకుంటాయి. చివరికి సందీప్ ఉగ్రవాదుల్ని ఎలా ఎదుర్కొన్నాడు. హోటల్ లో బందీలతో ఎలా వ్యవహరించాడు లాంటి వివరాల్ని కూడా హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించారు. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి గుండె బరువెక్కని ప్రేక్షకుడు ఉండడేమో. కాస్త సున్నితమైన వారు కచ్చితంగా ఏడుస్తారు కూడా. అంత ఎమోషనల్ గా ఉంది మేజర్ క్లైమాక్స్. రొమాంటిక్ సన్నివేశాలు, ప్రేమలు, లిప్ కిస్సులు లాంటివి మెయిన్ ప్లాట్ కు పెద్దగా ప్లస్ అవ్వనప్పటికీ.. సెకెండాఫ్ చూసిన తర్వాత అలాంటివన్నీ మరిచిపోతాం.
మేజర్ సందీప్ గా అడివి శేష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. సందీప్ గా శేష్ నటించాడు అనే కంటే జీవించాడు అనడం కరెక్ట్. ప్రీ-క్లైమాక్స్ లో అతడి నటన కంటతడి పెట్టిస్తుంది. ఇక సందీప్ తల్లిదండ్రులుగా నటించిన ప్రకాష్ రాజ్, రేవతి కూడా తన సహజ నటనతో కట్టిపడేశారు. కొడుకు చనిపోయాడని తెలిసినప్పుడు వాళ్ల నటన చూసి తీరాల్సిందే. ఇక ప్రకాష్ రాజ్ ఫైనల్ స్పీచ్ మరో హైలెట్. శోభిత కూడా ఉన్నంతలో బాగా చేసింది. మురళీశర్మ ఓకే.
టెక్నికల్ గా సినిమా హై-స్టాండర్డ్స్ లో ఉంది. మరీ ముఖ్యంగా ఆర్ట్ వర్క్ గురించి చెప్పుకోవాలి. తాజ్ హోటల్ ను చాలా బాగా రీక్రియేట్ చేశారు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. ఓవరాల్ గా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరోచిత పోరాటం ఆధారంగా తీసిన ఈ బయోపిక్.. సందీప్ కు సిసలైన నివాళిగా నిలుస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలు, దేశభక్తి సీన్స్ కోసం ఈ సినిమాను కచ్చితంగా చూసి తీరాల్సిందే.